India UNSC : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో గళమెత్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ వంటి దేశాలకు కచ్చితంగా శాశ్వత సభ్యత్వం దక్కాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు. భద్రతా మండలి విస్తరణకు ఫ్రాన్స్ అనుకూలంగా స్పందిస్తుందని మెక్రాన్ స్పష్టం చేశారు. ఐరాస భద్రతా మండలి విధానాల్లో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐరాస భద్రతా మండలి దేశాల వీటో పవర్‌పైనా సమీక్ష జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ శాంతి స్థాపనలో కీలక పాత్ర పోషించాల్సిన ఐరాస భద్రతా మండలిలో సాధ్యమైనన్ని ఎక్కువ దేశాలకు చోటు ఉండాలని మెక్రాన్ కోరారు. అంతర్జాతీయ సమాజం అవసరాలకు అనుగుణంగా ఐరాస భద్రతా మండలి రూపురేఖలు మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం భారత్‌తో పాటు బ్రెజిల్, జపాన్, జర్మనీ దేశాల పేర్లను కూడా పరిశీలించవచ్చన్నారు. మెక్రాన్ ప్రకటనతో.. ఐరాస భద్రతా మండలిలో(India UNSC) శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు బలమైన మద్దతు లభించినట్లు అయింది.
Also Read :Hasinas Ouster Planned : ఒక కుట్ర ప్రకారమే షేక్ హసీనాను గద్దె దింపారు : మహ్మద్ యూనుస్
కాగా, ప్రస్తుతం ఐరాస భద్రతా మండలిలలో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వం ఉంది. దీంతో ప్రపంచ దేశాలతో ముడిపడిన కీలక అంశాలలో ఈ దేశాలే పెత్తనం చలాయిస్తున్నాయి. భారత్, జపాన్ లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలకు కూడా చోటు కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతోంది. ఈక్రమంలో భారత్‌కు ప్రధాన ఆటంకంగా చైనా నిలుస్తోంది. ఒకవేళ భారత్‌కు ఐరాస భద్రతా మండలిలో చోటు లభిస్తే తమ మిత్రదేశం పాకిస్తాన్ ప్రయోజనాలు దెబ్బతినే ముప్పు ఉంటుందని చైనా భావిస్తోంది. అందుకే భారత్ ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకు డ్రాగన్ ప్రణాళికలు రచిస్తోంది. ఏదిఏమైనప్పటికీ ఫ్రాన్స్ వంటి ఐరాస భద్రతా మండలి సభ్యత్వ దేశం భారత్‌కు మద్దతు పలకడం కీలక పరిణామమే.