India Vs Pakistan : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ)లో పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. యూఎన్‌జీఏలో భారతదేశం యొక్క మొదటి కార్యదర్శి పెటల్ గహ్లోట్ మాట్లాడుతూ.. మొదట ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను ఖాళీ చేయాలని పాకిస్థాన్ కు హితవు పలికారు. భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని సూచించారు. పాకిస్థాన్‌లో మైనారిటీల హక్కుల ఉల్లంఘనలను అరికట్టాలన్నారు. ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్నమైన మానవ హక్కుల రికార్డు కలిగిన దేశం పాకిస్థాన్ అని పెటల్ గహ్లోట్ కామెంట్ చేశారు. మైనారిటీలు, మహిళల హక్కులలో పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా ఉందని ఆమె మండిపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అంతర్గత వ్యవహారంలో వేలు పెట్టే ధైర్యం చేసే ముందు, తన సొంత ఇంటిని సర్దుకోవడంపై పాకిస్తాన్ ఫోకస్ పెట్టాలన్నారు.
Also read : Srivari Padam Print : ఆ గుట్టలో శ్రీవారి పాదం ఆనవాలు.. భక్తుల ప్రత్యేక పూజలు
ముంబై ఉగ్ర దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ను పెటల్ గహ్లోట్ డిమాండ్ చేశారు. ‘‘దక్షిణాసియాలో శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి పాకిస్తాన్ మూడు చర్యలు తీసుకోవాలి. మొదటిది.. సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టాలి. తీవ్రవాదులకు మౌలిక సదుపాయాలు, నిధులు అందకుండా అరికట్టాలి. రెండోది.. ఆక్రమించుకున్న భారత భూభాగాలను ఖాళీ చేయాలి. మూడోది.. పాకిస్తాన్‌లో మైనారిటీలపై దాడులు జరగకుండా చూడాలి’’ అని ఆమె (India Vs Pakistan) కోరారు.