Site icon HashtagU Telugu

100కోట్ల వ్యాక్సిన్ క్ల‌బ్ లోకి ఇండియా.. మ‌ళ్లీ పెరుగుతోన్న క‌రోనా కేసులు!

కేవ‌లం తొమ్మిది నెల‌ల వ్య‌వ‌ధిలో 100 కోట్ల మందికి కోవిడ్ 19 వ్యాక్సిన్ పూర్త‌యింద‌ని ఇండియా సంబ‌రాలు జ‌రుపుకుంటోంది. ఇదంతా మోడీ నాయ‌క‌త్వం కార‌ణంగా సాధ్య‌మైయింద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మాంథ‌వ్య సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్ చేశారు. ఈ మైలురాయిని అత్యంత త‌క్కువ కాలంలోనే చేరిన‌ట్టు రెడ్ పోర్ట్ వ‌ద్ద జాతీయ జెండాల‌ను ఎగుర‌వేసి కేంద్ర ఆరోగ్య‌శాఖ అధికారులు, ఉన్న‌త స్థానాల్లోని వైద్యరంగ ఉద్యోగులు వేడుక చేసుకున్నారు. ఇదే రోజు అంటే గురువారంనాడు ఒక్క‌రోజే భార‌త్ లో 18,454 కేసులు న‌మోదు కావ‌డం విచిత్రం. మ‌ళ్లీ ఇండియాలో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ ఉండ‌డం గ‌మ‌నార్హం.

దేశం మొత్తం మీద వ్యాక్సిన్ వేయించిన మొద‌టి ఐదు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు వ‌రుస‌గా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, బెంగాల్‌, గుజ‌రాత్ మ‌రియు మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉన్నాయి. వ్యాక్సిన్ చేయించ‌డంలో తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ బాగా వెనుక బడ్డాయ‌ని కేంద్రం గుర్తించింది. దేశంలోని 130కోట్ల జ‌నాభాకుగాను 100కోట్ల మందికి వ్యాక్సిన్ వేయించిన అంశాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ సంతోషాన్ని వ్య‌క్తప‌రిచాడు. ఢిల్లీలోని రామ్ మ‌నోహ‌ర్ లోయ ఆస్ప‌త్రికి వెళ్లిన మోడీ అక్క‌డి వైద్యుల‌తో వ్యాక్సిన్ వివరాల‌ను పంచుకున్నారు. డాక్ట‌ర్లు, న‌ర్సులు ఇత‌ర వైద్య సిబ్బంది చేసిన కృషి ఫ‌లితంగా 100కోట్ల వ్యాక్సినేష‌న్ జ‌రిగింద‌ని ప్ర‌శంసించారు. ఇలాంటి మైలు రాయిని అందుకోవ‌డం వెనుక ఇండియా సైన్స్, ఐక్య‌త‌, చిత్త‌శుద్ధి క‌నిపిస్తోంద‌ని మోడీ కొనియాడారు.

నీతి ఆయోగ్ అంచ‌నా ప్ర‌కారం క‌నీసం 75 మంది అర్హ‌త ఉన్న పౌరుల‌కు మొద‌టి డోస్ పూర్తయింది. రెండో డోస్ వ్యాక్సిన్ 31శాతం మందికి ల‌భించింది. కేంద్రం ఆరోగ్య‌శాఖ లెక్క‌ల ప్ర‌కారం తొలి 86 రోజుల్లో 10కోట్ల మందికి, ఆ త‌రువాత 45 రోజుల్లో 20కోట్లు మ‌రియు మూడో విడ‌త 29 రోజుల్లో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసిన‌ట్టు తేల్చింది. ఈ ఏడాది జ‌న‌వ‌రి 16న వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు. మార్చి ఒక‌టో తేదీ నుంచి పౌరుల‌కు వేయడానికి శ్రీకారం చుట్టారు. తొలుత 60 ఏళ్లు పైబ‌డిన వాళ్ల‌కు ఆ త‌రువాత 45 ఏళ్ల వాళ్ల‌కు వ్యాక్సినేష‌న్ విడ‌త‌ల వారీగా వేశారు. మే ఒక‌టో తేదీ నుంచి 18ఏళ్ల పైబ‌డిన వాళ్ల‌కు ఇచ్చారు. త్వ‌ర‌లోనే చిన్నారుల‌కు వ్యాక్సన్ వేయ‌డానికి ఇండియా సిద్ధం అవుతోంది. ఇదంతా మోడీ ఆధ్వ‌ర్యంలోని ప‌టిష్ట ప్ర‌భుత్వం కార‌ణంగా సాధ్యం అయింద‌ని బీజేపీ ప్ర‌చారం చేసుకుంటోంది