Site icon HashtagU Telugu

UNO : 2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లు: ఐరాస అంచనా

India population to be 170 crore by 2061: UN estimate

India population to be 170 crore by 2061: UN estimate

UNO : ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా అంచనాలపై నివేదిక విడుదల చేసింది. 2061 నాటికి భారత్ జనాభా 170 కోట్లకు చేరుతుందని, 2100 నాటికి 150 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. మరోవైపు 2061 నాటికి చైనా జనాభా 120 కోట్లకు తగ్గుతుందని, 2100 నాటికి 63 కోట్లకు పరిమితం అవుతుందని నివేదికలో వెల్లడించింది. చైనా జనాభా 2021 నుంచి క్రమంగా తగ్గుముఖం పట్టినట్లు ఐరాస వెల్లడించింది.

Read Also: Places Of Worship Case: ‘‘ఇక చాలు..’’ ప్రార్థనా స్థలాల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

2024-54 మధ్య చైనా జనాభాలో భారీ ఎత్తున తగ్గుదల నమోదవుతుందని ఐరాస నివేదిక పేర్కొంది. జపాన్‌, రష్యాలోనూ జనాభా వేగంగా దిగొస్తుందని వెల్లడించింది. ఐరాస నివేదిక అంచనా ప్రకారం 2024-54 మధ్య చైనా జనాభా 20 కోట్లు, జపాన్‌ జనాభా 2 కోట్లు, రష్యా జనాభా కోటి తగ్గనుంది. 2100 నాటికి చైనా జనాభా 78.6 కోట్లు తగ్గి 63 కోట్లకే పరిమితంకానుందని ఐరాస నివేదిక తెలిపింది. ప్రస్తుతం చైనా జనాభా 141 కోట్లని, 2054 నాటికి 121 కోట్లకు తగ్గుతుందని ఐరాస నివేదిక తెలిపింది. 2100 నాటికి అది 63.3 కోట్లకు పడిపోతుందని అంచనా వేసింది. 2100 నాటికి చైనా జనాభా కంటే భారత జనాభా రెండున్నర రెట్లు ఎక్కువ ఉంటుందని తెలిపింది.

చైనాలో సగటున ఒక్కో మహిళ తమ జీవితకాలంలో ఒకరికి మాత్రమే జన్మనిస్తున్నట్లు తెలిపింది. సంతాన సాఫల్యత రేటు 2.1 ఉండాలని, అప్పుడే ప్రస్తుత జనాభా అలాగే కొనసాగుతుందని ఐరాసలో జనాభా విభాగాధిపతి జాన్‌ విల్మోత్‌ తెలిపారు. 1.8 లేదా 1.5 కంటే తక్కువకు చేరితే జనాభా గణనీయంగా పడిపోతుందని పేర్కొన్నారు. చైనా సహా మరికొన్ని దేశాల్లో ప్రస్తుతం అదే జరుగుతోందని వివరించారు. 2024లో 820 కోట్లుగా ఉన్న ప్రపంచ జనాభా 2080ల్లో గరిష్ఠానికి చేరుతుందని ఐరాస నివేదిక అంచనా వేసింది. వచ్చే 50-60 ఏళ్లలో ప్రపంచ జనాభా 1030 కోట్ల వద్ద గరిష్ఠానికి చేరుకుని అక్కడి నుంచి దిగొస్తూ ఈ శతాబ్దం చివరకు 1020 కోట్లకు తగ్గుతుందని తెలిపింది. సంతాన సాఫల్యత రేటు గణనీయంగా పడిపోవడమే జనాభా తగ్గడానికి కారణమని ఐరాస నివేదిక వివరించింది.

Read Also: Kavitha Special Focus Siddipet : హరీష్ రావు సీటుకే ఎసరు పెట్టిన కవిత..?