జాతినుద్దేశించి మోడీ స్పీచ్.. పది ప్రధాన పాయింట్లు!

  • Written By:
  • Updated On - October 22, 2021 / 01:14 PM IST

కరోనా నివారణలో వ్యాక్సిన్ దే కీలకం. ఎప్పుడైతే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైందే, అప్పట్నుంచే కరోనా కేసులు క్రమక్రమంగా అదుపులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం ఇండియా వంద కోట్ల వ్యాక్సినేషన్ క్లబ్ లో చేరింది. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. అతి తక్కువ సమయంలో భారత్ 100 కోట్ల మార్క్ దాటిందని జాతినుద్దేశించి మాట్లాడారు. మోడీ స్పీచ్ లో పది ప్రధాన పాయింట్లను ఇక్కడ ప్రస్తావిస్తున్నాం.

  1. అక్టోబరు 21న వంద కోట్ల కోవిడ్ టీకాల మార్కును చేరుకున్నాం.  ఆ మైలురాయితో భారత దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాం.  దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే ఇది సాధ్యమయింది. ఇది భారత్ విజయం. భారతీయులందరి విజయం. 100 కోట్లు అనేది సంఖ్య కాదు.. దేశ ప్రజల సంకల్పం.
  2. కరోనా వ్యాక్సిన్‌ల ద్వారా భారత్ శక్తి ఏంటో ప్రపంచానికి చూపించాం.  100 ఏళ్లలో ఇలాంటి మహమ్మారిని ఎప్పుడూ చూడలేదు. ఇది మనకు అతి పెద్ద సవాల్ విసిరింది. కానీ మనందరం కలిసి కట్టుగా పోరాడి కోవిడ్‌ను ఎదుర్కొన్నాం.
  3. కరోనా వైరస్ ముప్పు ఇంకా తొలగిపోలేదు.   పండగ వేళల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు.  అందరూ మాస్క్ ధరించాలి. ఇప్పటి వరకు ఎవరైనా టీకా వేసుకోకుంటే వారందరూ వెంటనే వెళ్లి టీకాలు వేసుకోవాలి. టీకాలు వేసుకున్న వారు ఇతరులను ప్రోత్సహించండి.
  4. కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎన్నో దేశాలు ఎదురు చూస్తున్నాయి. కరోనా అదృశ్య శక్తితో పోరాటంలో కోవిడ్‌ ప్రోటోకాల్‌ పాటించడమే మనకు రక్ష. వ్యాక్సిన్‌ తయారీలో మన శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడ్డారు.
  5. ప్రపంచంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థలు చాలా తక్కువ. మనం వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేకపోతే విదేశాల నుంచి రావడానికి ఏళ్లు పట్టేది. వాళ్ల అవసరాలు తీరాకే మనకు వ్యాక్సిన్‌ ఇచ్చే వాళ్లు.
  6. 75 శాతం వ్యాక్సిన్‌ డోసులను కేంద్రం సరఫరా చేస్తుంది. 25 శాతం వ్యాక్సిన్‌ డోసులు ప్రైవేటు ఆస్పత్రులు కొనుగోలు చేయవచ్చు. వ్యాక్సినేషన్‌ బాధ్యత ఇక పూర్తిగా కేంద్రమే తీసుకుంటుంది.
  7. ఎంత‌టి కఠినమైన లక్ష్యాన్ని అయినా దేశం విజయవంతంగా సాధించగలదనే దానికి ఇదో నిద‌ర్శ‌నం అని చెప్పారు. ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవ‌డం కోసం దేశం తీవ్రంగా కృషి చేస్తుంద‌ని అన్నారు. వ్యాక్సినేష‌న్‌పై తొలినాళ్లలో అనేకే భ‌యాందోళ‌న‌లు వ్యక్తం అయ్యాయ‌ని, వంద‌కోట్లకుపైగా ప్ర‌జ‌ల‌కు ఎలా వ్యాక్సిన్లు ఇస్తార‌న్న విమ‌ర్శ‌లు వినిపించాయ‌ని గుర్తు చేశారు.
  8. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఆశావాదం మాత్రమే ఉందని చెప్పారు. గ‌తంలో దేశంలో నినాదాలు మాత్ర‌మే వినిపించేవని, కానీ ఇప్పుడు అందరూ ‘మేడ్ ఇన్ ఇండియా’ గురించి మాట్లాడుతున్నారని గుర్తు చేశారు.
  9. 100 కోట్ల డోసులు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు.. దేశ సామర్థ్యానికి ప్రతీక. మన దేశం ఎంత సంకల్ప బద్ధంగా ఉందో దీన్ని బట్టి అర్థం అవుతుంది. భారత్‌ సాధించిన విజయాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి.
  10. కరోనా అత్యంతదారుణమైన మహమ్మారి. కరోనా వల్ల దేశ ప్రజలు ఎంతో బాధ అనుభవించారు. దేశ చరిత్రలో ఇంత మెడికల్‌ ఆక్సిజన్‌ ఎప్పుడూ అవసరం పడలేదు. కరోనాను పూర్తిగా అంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నాము అని అన్నారు.