India Vs Pakistan: రాబోయే 24 నుంచి 36 గంటల్లోగా పాకిస్తాన్‌పై భారత్ దాడి చేయబోతోందా ? పాకిస్తాన్ సమాచార మంత్రి అతావుల్లా తరార్ అయితే అదే జరగబోతోందని జోస్యం చెబుతున్నారు. దీనిపై తమకు విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం అందిందని అంటున్నారు. ఒకవేళ తమ దేశంపై దాడి జరిగితే.. మొత్తం ప్రాంతంలో, వెలుపల విపత్కర పరిణామాలు చోటుచేసుకుంటాయని అతావుల్లా తరార్ హెచ్చరించారు. 26 మంది మృతి చెందిన పహల్గామ్ ఉగ్రవాద దాడితో పాకిస్తాన్(India Vs Pakistan) ప్రమేయం లేదని స్పష్టం చేశారు. నిరాధారమైన, కల్పిత ఆరోపణలతో భారత దళాలు తమపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాయని పాకిస్తాన్ సమాచార మంత్రి బుకాయించారు. భారతదేశమే న్యాయమూర్తి పాత్రను, బాధితుడి పాత్రను పోషించాలని చూస్తోందని ఆయన కామెంట్ చేశారు. దీన్ని తాము తిరస్కరిస్తున్నామని అతావుల్లా తరార్ పేర్కొన్నారు.
దర్యాప్తు చేయించండి : అతావుల్లా తరార్
‘‘మాది బాధ్యతాయుతమైన దేశం. పహల్గాం ఉగ్రదాడి విషయంలో సత్యమేంటో గుర్తించడానికి నిపుణులతో తటస్థ కమిషన్ ఏర్పాటు చేసి విశ్వసనీయమైన, పారదర్శకమైన, స్వతంత్ర దర్యాప్తును జరిపిస్తే స్వాగతిస్తాం’’ అని అతావుల్లా తరార్ వెల్లడించారు. పాకిస్తాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనన్నారు. పాకిస్తాన్ తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకుంటుందన్నారు. ‘‘ఒకవేళ దాడి చేస్తే దాని పర్యవసానాల బాధ్యత భారతదేశంపైనే ఉంటుంది. ఈ వాస్తవాన్ని అంతర్జాతీయ సమాజం గ్రహించాలి’’ అని అతావుల్లా తరార్ పేర్కొన్నారు.
Also Read :Nuclear Missile: అణు ఆయుధాలు భారత్ కంటే పాకిస్థాన్‌కే ఎక్కువ ఉన్నాయా?
పాక్ ఆర్మీకి ఇక గడ్డుకాలమే..
పహల్గామ్ ఉగ్రదాడికి ఎలా స్పందించాలి ? లక్ష్యాలు ఏమిటి ? సమయం ఏమిటి ? అనేది నిర్ణయించడానికి భారత సాయుధ దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం ప్రకటించారు. దీనిపై ఇప్పటికే త్రివిధ దళాలకు సమాచారాన్ని అందించామని ఆయన చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్న ఉగ్రవాదులను భారతదేశం గుర్తించి శిక్షిస్తుందని గతంలోనే మోడీ వెల్లడించారు. ఈనేపథ్యంలో గత ఆరు రోజులుగా సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. దీంతో భారత్ కూడా వారిని బలంగా తిప్పికొడుతోంది. భారత ఆర్మీకి ప్రధాని మోడీ ఫ్రీడమ్ ఇచ్చినందున.. రానున్న రోజుల్లో పాక్ ఆర్మీ గడ్డుకాలాన్ని చూడనుంది.