టీ20 బ‌హిష్క‌ర‌ణ డిమాండ్ల వెల్లువ‌

క‌శ్మీర్లో ఉగ్ర‌వాదుల దాడుల క్ర‌మంలో టీ 20 మ్యాచ్ ను ఇండియా బ‌హిష్క‌రించాల‌నే డిమాండ్ బ‌లంగా తెర‌మీద‌కు వ‌స్తోంది.

  • Written By:
  • Publish Date - October 21, 2021 / 12:30 PM IST

క‌శ్మీర్లో ఉగ్ర‌వాదుల దాడుల క్ర‌మంలో టీ 20 మ్యాచ్ ను ఇండియా బ‌హిష్క‌రించాల‌నే డిమాండ్ బ‌లంగా తెర‌మీద‌కు వ‌స్తోంది. భార‌త జ‌వాన్లు, సామాన్యుల‌ను పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు కాల్చిన విష‌యం విదిత‌మే. ఆ దృష్ట్యా మ్యాచ్ కు దూరంగా ఉండాల‌ని రాజ‌కీయ పార్టీల‌తో పాటు సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. కానీ, బ‌హిష్క‌రించ‌డానికి క‌శ్మీర్లో జ‌రిగిన హ‌త్య‌లు కార‌ణంగా మానుకోవ‌డం మంచిది కాద‌ని మ‌రికొంద‌రు భావిస్తున్నారు. ప్రస్తుతం ఐసీసీ మ్యాచ్ ను నిర్వ‌హిస్తోంది. పైగా ఇప్ప‌టికే మ్యాచ్ ఆడ‌డానికి అగ్రిమెంట్ల అయ్యాయి. ఈ టైంలో బ‌హిష్క‌రించ‌డం ఇండియాకు చెడ్డ‌పేరు తెస్తుంద‌ని, ఈ మ్యాచ్ గెల‌వ‌డానికి అవకాశాలు మెండుగా ఉన్నాయ‌ని జాతీయ‌వాదులు కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అక్టోబ‌ర్ 24న భార‌త్‌, పాకిస్తాన్ మ‌ధ్య జ‌రిగే టీ 20 మ్యాచ్ కి భారీగా ఏర్పాట్లు చేశారు. భార‌త్ గెలుపుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని అంచ‌నా. విజ‌యం సాధిస్తే ఇదో పెద్ద ఉత్సాహం భార‌తీయుల్లో నిలిచిపోతుంద‌ని ఐసీసీ నిర్వాహ‌కులు అంటున్నారు. క‌శ్మీర్లో తొమ్మిది మంది భార‌త జ‌వాన్లు, 11 మంది సాధార‌ణ పౌరుల‌ను ఉగ్ర‌వాదులు కాల్చేశారు. ఇలాంటి ఉద్రిక్త‌త ప‌రిస్థితుల్లో భార‌త్‌, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అవ‌స‌ర‌మా? అంటూ ఓవైసీ అస్త్రాన్ని సంధిస్తున్నారు. ఈ మ్యాచ్ ల నిర్వ‌హ‌ణను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ప‌ర్య‌వేక్షిస్తున్నాడు. ఏషియ‌న్ క్రికెట్ కౌన్సిల్ అధిప‌తిగా జై షా ఈ మ్యాచ్ ల‌ను న‌డిపిస్తున్నాడు. అందుకే పాకిస్తాన్‌-భార‌త్ మ్యాచ్ కి, జ‌మ్మూ-క‌శ్మీర్ ఉద్రిక్త‌త‌కు ముడిపెట్టి రాజ‌కీయాన్ని వేడిక్కించారు.

జ‌మ్మూక‌శ్మీర్ లో తొమ్మిది మంది భార‌త జ‌వాన్ల‌ను ఉగ్ర‌వాదులు కాల్చేశారు. స్థానికేత‌రుల‌ను కూడా చంపారు. యునైటెడ్ లిబ‌రేష‌న్ ఫ్రంట్ ఆ దాడుల‌ను తామే చేశామ‌ని వెల్ల‌డించింది. కానీ, దానిపైన మోడీ నోరెత్త‌డంలేద‌ని ఓవైసీ విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సంధిస్తున్నారు. రాబోయే టీ 20 మ్యాచ్ చుట్టూ ఓవైసీ ఈ వివాదాల‌ను అల్లుతున్నారు. ఫ‌లితంగా భార‌త్-పాక్ మ్యాచ్ పై నీలిమేఘాలు క‌మ్ముకున్నాయి. అక్టోబ‌ర్ 24న ఏం జ‌రుగుతుందో చూద్దాం.