Site icon HashtagU Telugu

India : పాకిస్థాన్‌ నుండి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై తక్షణమే నిషేధం: భారత్‌

India imposes immediate ban on direct and indirect imports from Pakistan

India imposes immediate ban on direct and indirect imports from Pakistan

India : పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం.. దీని వెనక పాక్ ఉందని ఆరోపిస్తూ ఆ దేశంపై కఠిన చర్యలు చేపట్టింది. ఈక్రమంలోనే దాయాదితో అన్ని రకాల దౌత్య సంబంధాలు తెంచుకుంటోన్న న్యూఢిల్లీ తాజాగా ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది. ఈమేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పాకిస్థాన్‌ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఈ నిషేధం నుంచి ఏవైనా మినహాయింపులు కావాలంటే.. భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తమ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. పాకిస్థాన్‌లో ఉత్పత్తి అయ్యే లేదా ఆ దేశం నుంచి భారత్‌కు వచ్చే అన్నిరకాలా వస్తువుల ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నాం. అనుమతులు ఉన్న ఉత్పత్తులైనా, స్వేచ్ఛాయుత దిగుమతులైనా సరే పాక్‌ నుంచి ఎలాంటి వస్తువులను అనుమతించబోమని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Read Also: Sim Users: జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ సిమ్ వినియోగదారులకు శుభవార్త!

కాగా, 2019లో పుల్వామా దాడి తర్వాత నుంచి పాక్‌ నుంచి మనం చాలావరకు దిగుమతులు తగ్గించుకున్నాం. పాక్‌ ఉత్పత్తులపై కేంద్రం 200శాతం సుంకం విధించింది. కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనెగింజల వంటి వాటిని మాత్రమే దాయాది నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. పాక్‌లోని కొన్ని పరిశ్రమలు భారత్‌కు చేసే ఎగుమతులపైనే ఆర్థికంగా ఆధారపడుతున్నాయి. ఆర్గానిక్‌ కెమికల్స్‌, ప్లాస్టిక్స్‌, విలువైన లోహ సమ్మేళనాలు, మినరల్‌ ఫ్యుయల్స్‌, నూనె ఉత్పత్తులు, కొన్ని రకాల పిండి పదార్థాలు, బంక, ఎంజైమ్స్‌, వర్ణ ద్రవ్యాలు, మసాలా దినుసులు వంటివి దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఉన్నాయి. ఇప్పుడు భారత్‌ వాటిపై నిషేధం విధించడంతో పాక్‌లో ఆయా రంగాల పరిశ్రమలు కుదేలయ్యే అవకాశం ఉంది.

ఈ దిగుమతుల విలువ చాలా తక్కువే. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌ నుంచి పాక్‌కు 447.65 మిలియన్‌ డాలర్ల వస్తువులు ఎగుమతి కాగా.. అక్కడినుంచి కేవలం 0.42 మిలియన్‌ డాలర్ల ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా భారత్‌ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం 0.1శాతం మాత్రమే. ఇక, ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌ పహల్గాంలో ఉగ్రవాదులు అమానుషంగా 26 మంది టూరిస్టుల ప్రాణాల్ని బలితీసుకున్నారు. ఈ దాడి తర్వాత భారత్‌,పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నాటి నుంచి వరుస కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్‌ను భారత్‌ దెబ్బకు దెబ్బ తీస్తోంది.

Read Also: Indiramma house : ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వొద్దు: ఇంజనీర్లకు మంత్రి పొంగులేటి సూచన