Heat wave: దేశంలో వ‌డ‌గాలుల తీవ్ర‌త‌పై అప్ర‌మ‌త్త‌మైన కేంద్రం.. ప‌ది రాష్ట్రాల‌కు కేంద్ర బృందాలు

వేడి గాలులు, వాతావరణ పరిస్థితుల యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలను సూచించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)ని కూడా ఆదేశించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు.

  • Written By:
  • Updated On - June 20, 2023 / 07:41 PM IST

దేశంలో అనేక రాష్ట్రాల్లో వేడి తీవ్రత పెరుగుతోంది. మ‌రికొద్ది రోజుల‌పాటు ఇదే ప‌రిస్థితులు నెల‌కొన‌నున్న నేప‌థ్యంలో కేంద్రం ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. పలు రాష్ట్రాల్లో వేడి గాలుల‌ తీవ్రతపై దృష్టిసారించింది. ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సీనియర్ అధికారులతో మంగ‌ళ‌వారం స‌మీక్ష జ‌రిపారు. ఈ స‌మీక్షలో ప‌లు విష‌యాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం.. వేడి గాలుల తీవ్రత ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాల్లో పర్యటించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ, ఐఎండీ విభాగానికి చెందిన ఐదుగురు అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు.

ఈ బృందం వేడి తీవ్రత ఎక్కువ‌గా ఉండే రాష్ట్రాలను సందర్శిస్తుందని మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ బృందం ప‌ర్య‌టించ‌నుంది. రానున్న కొన్నిరోజులపాటు ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన, అతి తీవ్రమైన వేడిగాలులు ఉంటాయని వాతావరణ శాఖ అంచ‌నా వేసింది. ఇదిలాఉంటే.. కొన్నిరోజులుగా పలు రాష్ట్రాల్లో వేడి గాలులు, వాతావరణ పరిస్థితి కారణంగా మరణాలు నమోదు కావడంతో కేంద్రం చ‌ర్య‌లు మొద‌లు పెట్టింది.

వేడి గాలులు, వాతావరణ పరిస్థితుల యొక్క ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలను సూచించాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)ని కూడా ఆదేశించినట్లు మాండవీయ పేర్కొన్నారు. వేడి గాలుల‌ తీవ్రత ప్రభావం సాధారణ ప్రజలపై చూపకుండా ఉండేందుకు తగిన సూచనలు, సలహాలు చెప్పాలని ఐసీఎంఆర్‌ని ఇప్ప‌టికే కేంద్రం కోరింది.

Late Nights: ఆలస్యంగా నిద్రపోతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!