దేశంలో ఏదోక రకంగా అల్లర్లకు పాల్పడుతూ..శాంతిని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తోన్న ఉగ్రమూకలకు కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దేశ సరిహద్దు ద్వారా భారత్ ను టార్గెట్ చేసే ఉగ్రవాదుల పనిపట్టేందుకు అసరమైతే సరిహద్దులు దాటేందుకు సిద్ధమని హెచ్చరించారు. 1971 భారత్-పాక్ యుద్ధంలో పాల్గొన్న అసోంకు చెందిన వెటరన్స్ సన్మాన సభ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశం నుంచి ఉగ్రవాదాన్ని పూర్తిగా తరిమికొట్టడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని తెలిపారు. ఉగ్రవాద చర్యల్ని కఠినంగా తిప్పికొడతామనే సందేశం ఇవ్వడంలో భారత సక్సెస్ అయ్యిందన్నారు. బయట నుంచి దేశాన్ని టార్గెట్ చేస్తే సరిహద్దుల్ని దాటేందుకు సైతం వెనకాడబోమన్నారు. దేశ పశ్చిమ సరిహద్దుతో పోలిస్తే తూర్పు సరిహద్దుల్లో శాంతి, సుస్థిరత నెలకొందని రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ వైపు నుంచి చొరబాటు సమస్య దాదాపుగా ముగిసిపోయిందన్నారు.