RBI : అంతర్జాతీయ కరెన్సీగా మన రూపాయి..ఆర్బీఐ పచ్చజెండాతో ఏం జరగబోతోంది?

అంతర్జాతీయ కరెన్సీ అంటే.. ఇప్పటిదాకా డాలర్ మాత్రమే!! ఇప్పుడు ఇతర దేశాలూ తమ కరెన్సీని గ్లోబల్ స్థాయికి చేర్చే ప్రయత్నాల్లో నిమగ్నం అయ్యాయి.

  • Written By:
  • Publish Date - July 13, 2022 / 09:00 PM IST

అంతర్జాతీయ కరెన్సీ అంటే.. ఇప్పటిదాకా డాలర్ మాత్రమే!! ఇప్పుడు ఇతర దేశాలూ తమ కరెన్సీని గ్లోబల్ స్థాయికి చేర్చే ప్రయత్నాల్లో నిమగ్నం అయ్యాయి. ఈ జాబితాలో మన ఇండియా కూడా ఉంది. వాణిజ్య లావాదేవీలను రూపాయిల్లో నిర్వహించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై ఆర్‌బీఐ ఒక అధికారిక ప్రకటన కూడా చేసింది. ఈ నిర్ణయం వల్ల కొన్ని దేశాలతో వాణిజ్యం కోసం అమెరికా డాలర్‌ వంటి ప్రపంచ కరెన్సీని ఉపయోగించకుండా, ప్రత్యామ్నాయ మార్గం భారత్‌కు లభిస్తుంది.

రూపాయితో పేమెంట్స్ ఇలా..

ఈ కొత్త పద్ధతి ప్రకారం, ఎగుమతులు, దిగుమతులు రెండూ వాణిజ్య భాగస్వామ్య దేశాల కరెన్సీల మధ్య మార్కెట్‌ నిర్ణయించబడే మారకపు రేటుతో రూపాయిలో డినామినేట్‌ అవుతాయి. ఈ మేరకు  ఇన్‌వాయిస్‌ కూడా రూపొందుతుంది. ఈ వాణిజ్య ఒప్పందాల సెటిల్‌మెంట్‌ కోసం.. అధీకృత భారతీయ బ్యాంకులు భాగస్వామి ట్రేడింగ్‌ దేశంలోని ఆ దేశ అధీకృత  బ్యాంకులో ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతాలను తెరుస్తాయి. ఈ యంత్రాంగాన్ని ఉపయోగించి భారతీయ దిగుమతిదారులు రూపాయల్లో పేమెంట్స్ చెల్లించాలి. ఈ అమౌంట్.. ఇన్ వాయిస్ కు స్పందనగా భాగస్వామి దేశం కరస్పాండెంట్‌ బ్యాంక్‌ ప్రత్యేక వోస్ట్రో ఖాతాలో జమ అవుతాయి.
మరోవైపు భారతీయ ఎగుమతిదారులు, భాగస్వామి దేశం కరస్పాండెంట్‌ బ్యాంక్‌  ఏర్పాటు చేసిన ప్రత్యేక వోస్ట్రో ఖాతాలోని బ్యాలెన్స్‌ నుంచి రూపాయిలలో ఆ డబ్బును పొందుతారు. ఈ విధానం కింద భారతీయ ఎగుమతిదారులు ముందస్తు చెల్లింపులను సైతం రూపాయిల్లో పొందొచ్చు. అయితే, అటువంటి ముందస్తు చెల్లింపు చేయడానికి ముందు, బ్యాంకులు సంబంధిత ఖాతాల్లో అందుబాటులో ఉన్న నిధులను ముందుగా అమలు చేసిన ఎగుమతి ఆర్డర్‌ల కు చెల్లింపులు చేయడానికి ఉపయోగించాలి. ఆపై నిధులనే పరస్పర అవగాహన మేరకు ఎగుమతిదారులు ముందస్తు చెల్లింపులుగా వినియోగించాలి.

ఒత్తిడిలో రూపాయి..

ఈ సంవత్సరం రూపాయి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. సంవత్సరం ప్రారంభంలో US డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ. 74 నుంచి దాదాపు 6.7% వరకు క్షీణించింది.అంతర్జాతీయంగా డాలర్‌కు డిమాండ్, దేశం నుంచి విదేశీ పెట్టుబడుల వరద, క్రూడ్‌ ఆయిల్‌ ధరల అనిశ్చితి, ద్రవ్యోల్బణం సవాళ్లు, వడ్డీరేట్ల పెంపు వంటి పలు అంశాలు రూపాయి సెంటిమెంట్‌ను
బలహీనపరుస్తున్నాయి. అమెరికా ఫెడ్ చర్యల కారణంగా.. జపనీస్ యెన్, పోలిష్ జ్లోటీ, చిలీ పెసో, థాయ్ బాట్ కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. వీటికి తోడు ప్రపంచంలోని అనేక ఇతర దేశాల కరెన్సీలు సైతం భారీగా తమ విలువను కోల్పోయాయి.

దిద్దుబాటు చర్యలు చేపట్టినా..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ రంగంలోకి దిగినప్పటికీ.. రూపాయి మొదటిసారి మే నెలలో 77 మార్కును, జూన్‌లో 78 మార్కును, ఈ నెలలో 79 స్థాయిని అధిగమించి ట్రేడ్ అవుతోంది. ఆర్‌బీఐ డాలర్లను విక్రయించింది, ఫారెక్స్ ఇన్‌ఫ్లోలను పెంచడానికి చర్యలు ప్రకటించింది, ఇదే క్రమంలో రూపాయికి దన్నుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై పన్నును కూడా విధించింది.