India China Relations : భారత్–చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. దాదాపు ఏడాది రోజులుగా నిలిచిపోయిన కీలక వస్తువుల సరఫరా పునరుద్ధరించేందుకు చైనా అంగీకరించింది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మళ్లీ సాధారణ దిశలో సాగుతున్న సంకేతంగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి అత్యవసరమైన యూరియా, ఎన్‌పీకే, డీఏపీ వంటి ఎరువులు, మౌలిక సదుపాయాల నిర్మాణానికి కీలకమైన టన్నెల్ బోరింగ్ మెషీన్లు (టీబీఎం), అలాగే ఆటోమొబైల్ పరిశ్రమలో ఉపయోగించే రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులను తిరిగి ప్రారంభించనున్నట్లు చైనా అధికారికంగా హామీ ఇచ్చింది.
ఈ నిర్ణయాన్ని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం నాడు భారత్ పర్యటన సందర్భంగా ప్రకటించారు. ఆయన న్యూ ఢిల్లీలో మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఆ భేటీలో వాంగ్ యీ, నిలిచిపోయిన సరఫరాలను తిరిగి ప్రారంభించే నిర్ణయాన్ని వెల్లడించారు. గత నెలలో జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ సమస్యను ప్రత్యక్షంగా లేవనెట్టి, భారత్‌కు ఎరువులు, యంత్రాలు, ఖనిజాల సరఫరా అత్యవసరమని చైనా నాయకత్వానికి వివరించారు. దానికి చైనా సానుకూలంగా స్పందించి ఈ నిర్ణయం తీసుకోవడం ఇరు దేశాల మధ్య సఖ్యతా వాతావరణం తిరిగి ఏర్పడుతున్నదానికి నిదర్శనంగా అభిప్రాయపడుతున్నారు నిపుణులు.
Producers: యూనియన్ నిబంధనలతో సినిమాలు తీయలేం: నిర్మాతలు
భారత్ మొత్తం ఎరువుల అవసరాల్లో దాదాపు 30 శాతం దిగుమతులు చైనా నుంచే వస్తాయి. అందువల్ల ఈ సరఫరా నిలిపివేయడం వల్ల గత కొంతకాలంగా భారత రైతులు, ఎరువుల రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇప్పుడు చైనా పునరుద్ధరించిన నిర్ణయం రైతులకు ఊరట కలిగించనుంది. అదే సమయంలో మౌలిక వసతుల నిర్మాణ ప్రాజెక్టులు, రోడ్లు, రైల్వేలు, మెట్రో సదుపాయాల నిర్మాణం కోసం అత్యవసరమైన టన్నెల్ బోరింగ్ మెషీన్ల సరఫరా మళ్లీ మొదలవడం మౌలిక రంగానికి కూడా శక్తినిస్తుంది. ఆటోమొబైల్ రంగంలో ఉపయోగించే రేర్ ఎర్త్ మినరల్స్ సరఫరా తిరిగి రావడం పరిశ్రమలకు ఊపిరి పోసే అంశంగా పరిగణిస్తున్నారు.
ఈ సమావేశంలో వాణిజ్య అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలపై కూడా పరోక్ష చర్చలు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు భారత్, చైనా రెండింటినీ ప్రభావితం చేస్తున్నాయని ఇరుపక్షాలు అభిప్రాయపడ్డాయి. వాషింగ్టన్ తీసుకుంటున్న నిర్ణయాల వలన ఏర్పడుతున్న అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కోవాలంటే భారత్–చైనా మరింత దగ్గరగా మెలగడం అవసరమని రెండు దేశాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో సరిహద్దు వివాదాలపై ప్రస్తావన రాలేదు. లడఖ్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి కొనసాగుతున్న సమస్యలు ఇంకా పరిష్కార దశలో ఉన్నందున, ఆ అంశాన్ని ప్రత్యేకంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా ప్రత్యేక ప్రతినిధులతో నేడు జరపబోయే సమావేశంలో చర్చించనున్నారు. సుమారు 3,488 కిలోమీటర్ల పొడవైన ఎల్ఏసీ వద్ద బలగాల ఉపసంహరణ ప్రధాన అజెండాగా ఉండనుంది.
ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్, భారత్ తైవాన్‌పై తన పాత విధానాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఆ దేశంతో కేవలం ఆర్థిక, సాంస్కృతిక సంబంధాల కోసం మాత్రమే దౌత్యపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, చైనాకు వ్యతిరేకంగా ఏ ఉద్దేశ్యం లేదని తెలియజేశారు. సాయంత్రం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కావడం కూడా ఈ పర్యటనలో ముఖ్య ఘట్టంగా నిలవనుంది. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య విస్తృత దిశలో సహకార అవకాశాలు, వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ వేదికలపై సమన్వయం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఈ పరిణామం భారత్–చైనా సంబంధాలు గతంలో ఉన్న ఉద్రిక్తతల నుంచి కొంతమేరకు దూరమవుతూ మళ్లీ సాధారణ దిశలో పయనిస్తున్నాయని సంకేతాలు ఇస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వాణిజ్య సహకారం మళ్లీ పునరుద్ధరించబడటం ద్వైపాక్షిక విశ్వాసాన్ని పెంచుతుందని, దీని ద్వారా సరిహద్దు సమస్యల పరిష్కారానికి కూడా పరోక్షంగా అనుకూల వాతావరణం ఏర్పడవచ్చని విశ్లేషిస్తున్నారు.
Heavy Rain: తెలంగాణ, ఏపీకి భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక!