Site icon HashtagU Telugu

Judge Vs India Bloc : ‘‘హిందుస్తాన్’’ వ్యాఖ్యలు.. హైకోర్టు జడ్జిపై ‘ఇండియా’ కూటమి అభిశంసన తీర్మానం

Allahabad High Court Judge Vs India Bloc Impeach Motion

Judge Vs India Bloc : ‘‘ఇది హిందుస్తాన్.. ఇక్కడ మెజారిటీ ప్రజల అభిమతమే చెల్లుబాటు అవుతుంది’’ అంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ అంశాన్ని విపక్ష ఇండియా కూటమి కూడా సీరియస్‌గా తీసుకుంటోంది. ఆ జడ్జీపై అభిశంసన తీర్మానం కోసం ఇండియా కూటమి ఎంపీలు సంతకాల సేకరణ ప్రక్రియను బుధవారమే ప్రారంభించారు. తాజాగా అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్‌పై అభిశంసన తీర్మానం లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ ప్రవేశపెట్టనున్నారు. రాజ్యసభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కనీసం 50 మంది ఎంపీల సంతకాలు అవసరం. లోక్‌సభలో కనీసం 100 మంది ఎంపీల సంతకాలతో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టొచ్చు. ఇండియా కూటమి ఇప్పటికే రాజ్యసభలో 38 మంది ఎంపీల సంతకాలను, లోక్‌సభలో 50 మంది ఎంపీలను సంతకాలను సేకరించిందని తెలిసింది. ఇండియా కూటమికి ప్రస్తుతం లోక్‌సభలో 237 మంది ఎంపీలు, రాజ్యసభలో 86 మంది ఎంపీలు ఉన్నారు. అయితే ఈ అభిశంసన తీర్మానం ఓటింగ్‌ దశలో(Judge Vs India Bloc) వీగిపోవచ్చు. ఎందుకంటే.. రాజ్యసభ, లోక్‌సభల్లో ఎంపీల సంఖ్య విషయంలో ఎన్డీయే కూటమిదే పైచేయి.

Also Read :WhatsApp: వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ సేవలకు అంతరాయం

డిసెంబర్ 8న అలహాబాద్‌లో విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్, హలాలా వంటి వాటిని దేశంలో అమలుకు అనుమతించకూడదని ఆయన కామెంట్  చేశారు.  “ఒక హిందువు మాత్రమే ఈ దేశాన్ని ‘విశ్వ గురువు’గా మార్చగలడు అని పేర్కొన్నారు.

Also Read :Warning To Manchu Vishnu: మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచ‌కొండ సీపీ!

గత చరిత్ర..

  • రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(4) ప్రకారం..  నిరూపితమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగించవచ్చు. “దుష్ప్రవర్తన” అనే పదం పరిధిలోకి న్యాయ నైతికత, నిష్పాక్షికత, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలు వస్తాయి.
  • మన దేశానికి  స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ కోర్టులోని న్యాయమూర్తిని కూడా ఇప్పటిదాకా  అభిశంసన తీర్మానం ద్వారా పార్లమెంటు తొలగించలేదు.
  • జడ్జీలకు వ్యతిరేకంగా గతంలో అభిశంసన తీర్మానాలు ఏడుసార్లు పార్లమెంటు ఎదుటకు వచ్చాయి. వాటిలో రెండు కేసులలో సదరు వివాదాలను ఎదుర్కొన్న  ఇద్దరు జడ్జీలు రాజీనామాలు చేశారు. వీరిలో ఒకరు పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ మొదలుకాక ముందే జడ్జీ పదవికి రాజీనామాను సమర్పించారు.
  • 1993లో లోక్‌సభలో అభిశంసనను ఎదుర్కొన్న మొదటి న్యాయమూర్తి పేరు.. జస్టిస్ వి రామస్వామి. అయితే ఆయనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించలేకపోయింది.
  • 2011లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్ర సేన్‌పై మోషన్ వచ్చింది. ఆయన రాజ్యసభ ద్వారా అభిశంసనకు గురైన మొదటి న్యాయమూర్తి అయ్యారు. లోక్‌సభలో తీర్మానంపై ఓటింగ్ జరగకముందే ఆయన రాజీనామాను సమర్పించారు.