Shashi Tharoor : బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల నేపథ్యంలో షేక్ హసీనా (Sheikh Hasina)ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి ఆ దేశాన్ని వీడిన విషయం తెలిసిందే. ఈ కష్ట సమయంలో హసీనాకు భారత్ అండగా నిలిచి.. దేశంలో ఆశ్రయం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
‘షేక్ హసీనాకు సాయం చేయకపోయి ఉంటే అది భారతదేశానికి అవమానకరంగా ఉండేది. మన స్నేహితులతో మనం చెడుగా ప్రవర్తిస్తే ఎవరూ మన స్నేహితులుగా ఉండాలని కోరుకోరు. హసీనా జీకి భారతదేశ నాయకులందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. షేక్ హసీనా భారతదేశానికి స్నేహితురాలు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసేందుకు ముందు ఒకటికి రెండు సార్లు ఎవరూ ఆలోచించరు. భారత ప్రభుత్వం కూడా ఈ కష్ట సమయంలో హసీనాకు అండగా నిలిచింది. ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి భద్రత కల్పించింది. భారత ప్రభుత్వం చేసిన పనిని నేను ఒక భారతీయుడిగా అభినందిస్తున్నాను. హసీనా విషయంలో భారత్ సరైన పనే చేసింది’ అని థరూర్ వ్యాఖ్యానించారు.
Read Also: Bangladesh : భారత్ ఎదుట పాక్ ఆర్మీ సరెండర్.. శిల్పాలు ధ్వంసం చేసిన అల్లరిమూకలు
‘ఆమె ఇక్కడ ఎన్నాళ్లు ఉంటారన్నది మనకు అనవసరం. మనం ఎవరినైనా ఇంటికి ఆహ్వానించిన తర్వాత ఎప్పుడు వెళ్లిపోతారు అని అడగం. ఆమె ఇక్కడ ఎన్నాళ్లు ఉండాలనుకుంటే అన్నాళ్లు మనం వేచి చూసే వైఖరి పాటించాలని భావిస్తున్నాను” అని శశిథరూర్ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీ హిందువులపై దాడుల విషయంలో థరూర్ స్పందిస్తూ.. ”కచ్చితంగా అక్కడ కొన్ని దాడులు జరిగాయి. ఇది కాదనలేని విషయం. అది నిజం. అదే సమయంలో కొందరు ముస్లింలు అక్కడి హిందువులను, దేవాలయాలను కాపాడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇన్ని చెడు వార్తల మధ్య అదొక్కటే కొంచెం ఊరట కలిగించే అంశం’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు అమెరికాకు తలొగ్గితే అధికారంలో కొనసాగేదాన్నేనని, సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టలేకే పదవి నుంచి వైదొలగానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇటీవల పేర్కొన్నారు. త్వరలోనే స్వదేశానికి చేరుకుంటానని చెప్పారు. ”నేను సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి.. అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు లభించేలా చేస్తే పదవిలో కొనసాగేదాన్ని. దానికి ఇష్టపడక ప్రధాని పదవికి రాజీనామా చేశాను” అని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలే తన బలమని, వారు తనను వద్దనుకోవడంతో దేశం వీడానని చెప్పారు. తాను ఓడిపోయినా ప్రజలు గెలిచారని వ్యాఖ్యానించారు. వారి కోసమే తమ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందన్నారు. మరోవైపు హసీనా ఆరోపణలను అమెరికా తోసిపుచ్చింది.