UPI One World: భారతదేశపు డిజిటల్ పేమెంట్ సిస్టమ్ UPI ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన ముద్ర వేస్తోంది. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’కు హాజరైన 40కి పైగా దేశాల ప్రతినిధుల కోసం NPCI ‘UPI One World’ వాలెట్ సేవను ప్రారంభించింది. ఇకపై విదేశీ పర్యాటకులు, ప్రతినిధులు భారతదేశంలో చెల్లింపులు చేయడానికి భారతీయ మొబైల్ నంబర్ లేదా స్థానిక బ్యాంక్ ఖాతా ఉండాల్సిన అవసరం లేదు.
‘UPI One World’ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది?
ఇది ఒక ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ (PPI) వాలెట్. దీనిని ప్రత్యేకంగా విదేశీ ప్రయాణికుల కోసం రూపొందించారు.
స్థానిక నంబర్ లేకుండానే రిజిస్ట్రేషన్: విదేశీ అతిథులు తమ దేశ పాస్‌పోర్ట్, వీసా ద్వారా దీనిపై రిజిస్టర్ చేసుకోవచ్చు.
నగదు కష్టాలకు చెక్: వారు ఇకపై భారీగా నగదును వెంట తీసుకెళ్లాల్సిన పనిలేదు లేదా ఫారెక్స్ కార్డులపై ఆధారపడక్కర్లేదు. వారు నేరుగా తమ కరెన్సీ లేదా కార్డ్ ద్వారా ఈ వాలెట్‌ను టాప్-అప్ చేసుకోవచ్చు.
స్కాన్ అండ్ పే: ఈ వాలెట్ ద్వారా వారు భారతదేశంలోని ఏ దుకాణదారుడికైనా QR కోడ్‌ని స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు.
అతిథులకు ఈ సౌకర్యం ఎలా లభిస్తుంది?
NPCI ఈ సేవను చాలా సులభతరం చేసింది.
టచ్ పాయింట్లు: ఈ సేవ న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, సమ్మిట్ వేదిక (భారత్ మండపం) లోని హాల్ నంబర్ 14లో ఉన్న NPCI పెవిలియన్ వద్ద అందుబాటులో ఉంది.
CheqUPI యాప్: అతిథులు ‘CheqUPI’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. తమ ప్రాథమిక వివరాలను పూరించాలి. సెల్ఫీ వెరిఫికేషన్‌తో పాటు తమ UPI PIN సెట్ చేసుకోవాలి.
పరిమితి: వారు ఒకేసారి రూ. 25,000 వరకు లోడ్ చేసుకోవచ్చు. దీని నెలవారీ పరిమితి రూ. 50,000గా నిర్ణయించారు.
బ్యాలెన్స్ రీఫండ్: ప్రయాణం ముగిసే సమయానికి వాలెట్‌లో డబ్బు మిగిలి ఉంటే వాటిని తిరిగి వారి అసలు పేమెంట్ సోర్స్ (విదేశీ ఖాతా) కు బదిలీ చేసుకోవచ్చు.
ఈ చొరవ ఎందుకు ప్రత్యేకం?
NPCI గ్రోత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోహిని రజోలా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సర్వీస్ విదేశీ అతిథులకు భారతదేశపు ‘మేడ్ ఇన్ ఇండియా’ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI)ను అనుభవించే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్త అనుసంధానాన్ని పెంచడమే కాకుండా భవిష్యత్తులో క్రాస్-బార్డర్ (దేశాల మధ్య) చెల్లింపులు ఎంత సులభంగా ఉంటాయో కూడా చూపుతుంది.
