Mayawatis Successor: బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి రాజకీయ వారసత్వాన్ని పొందేది ఎవరు ? అనే దానిపై చర్చ జరుగుతున్న తరుణంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఉన్నంత కాలం పార్టీకి వారసులు అంటూ ఎవరూ ఉండరని మాయావతి తేల్చి చెప్పారు. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను బీఎస్పీకి సంబంధించిన రెండు కీలక బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు మాయావతి రాజకీయ వారుసుడిగా, బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్‌గా ఆకాశ్ ఆనంద్ వ్యవహరించారు. లక్నోలో ఇవాళ (ఆదివారం) జరిగిన బీఎస్పీ జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో మాయావతి ఈ నిర్ణయాలను ప్రకటించారు.
Also Read :Samsung Phones : ‘శాంసంగ్’ మూడు కొత్త ఫోన్లు.. ఫీచర్లు ఇవిగో
రామ్జీ గౌతం సేవలను గుర్తించిన మాయావతి
ఆకాశ్ ఆనంద్‌ను బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పించిన మాయావతి(Mayawatis Successor), ఆ కీలక పోస్టులో రాజ్యసభ ఎంపీ రామ్జీ గౌతంను తిరిగి నియమించారు. అంతకుముందు 2019 వరకు ఇదే పదవిలో రామ్జీ గౌతం ఉండేవారు. ఆకాశ్ ఆనంద్ రాకతో క్రమంగా రామ్జీ గౌతం ప్రాధాన్యం తగ్గిపోయింది. ఈవిషయంపై పార్టీ వర్గాల నుంచి మాయావతికి ఫీడ్ బ్యాక్ అందింది. దీంతో అలర్ట్ అయిన ఆమె బీఎస్పీలో సంస్కరణలకు నడుం బిగించారు. ప్రస్తుతం పార్టీ జాతీయ కోఆర్డినేటర్‌గా మాయావతి చిన్న తమ్ముడు ఆనంద్ కుమార్ ఉన్నారు. రామ్జీ గౌతం కూడా మరో నేషనల్ కోఆర్డినేటర్‌గా వ్యవహరించనున్నారు.
Also Read :Meenakshi Natarajan: వివాదాలకు చెక్.. యాక్షన్ స్టార్ట్.. మీనాక్షి గ్రౌండ్ వర్క్
ఆకాశ్ ఆనంద్‌ను ఎందుకు తప్పించారు ?
ఆకాశ్ ఆనంద్ మామగారి పేరు అశోక్ సిద్దార్థ్. ఆకాశ్ ఆనంద్ ప్రత్యేక ఆసక్తితో తన మామ అశోక్‌కు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇప్పించారు. ఆ పదవీ కాలం ముగిసిపోయింది. అయితే బీఎస్పీలో వర్గాలను అశోక్ సిద్దార్థ్ ప్రోత్సహిస్తున్నారని మాయావతికి ఫిర్యాదులు అందాయి. దీంతో అశోక్‌ను పార్టీ నుంచి మాయావతి బహిష్కరించారు. ఆ పరిణామానికి కొనసాగింపుగా ఇప్పుడు ఆకాశ్ ఆనంద్‌ను కూడా పార్టీ పదవుల నుంచి మాయావతి తప్పించారు. ఆకాష్ ఆనంద్ రాజకీయ కెరీర్‌పై ఆయన మామ అశోక్ ప్రభావం ఉందని ఇటీవలే మాయావతి కామెంట్ కూడా చేశారు. ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ బాధ్యతల నుంచి మాయవతి తప్పించడం ఇది రెండోసారి. 2024 మేలో లోక్‌సభ ఎన్నికల సమయంలో పార్టీ బాధ్యతల నుంచి ఆకాశ్‌ను ఒకసారి తప్పించారు. అయితే వెంటనే అదే ఏడాది జులైలో బీఎస్పీకి సంబంధించిన రెండు కీలక బాధ్యతలను ఆకాశ్‌కు మాయావతి అప్పగించారు.