Site icon HashtagU Telugu

CJI NV Ramana : `సుప్రీం`చరిత్రలో నిలిచేలా ప‌ద‌వీ విర‌మ‌ణ రోజు..

Nv Ramana Live

Nv Ramana Live

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప‌ద‌వీకాలం శుక్ర‌వారంతో ముగిసింది. జస్టిస్ కోకా సుబ్బారావు తర్వాత సుదీర్ఘకాలం సుప్రింకోర్టు సీజేఐగా రమణ సేవలు అందించారు. చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా తొలిసారి సుప్రీం కోర్టు ప్రోసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేయించారు. భార‌త సుప్రీంకోర్టు చరిత్రలో ఇది కీలక పరిణామంగా నిలిచిపోయింది. ఉదయం 10.30 గంటల నుండి NIC (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్) వెబ్‌కాస్ట్ పోర్టల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయ‌డం విశేషం.
YouTube video player

2021 ఏప్రిల్ 24వ తేదీన‌ సీజేఐగా ఎన్వీ రమణ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. న్యాయవాది నుంచి సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు ఎదిగిన రైతు కుటుంబం నుంచి ఎదిగిన తెలుగు బిడ్డ ఎన్వీ రమణ. 13ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా సేవ‌లు అందించారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప‌ని చేశారు. 2014 ఫిబ్రవరి 17 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవ‌లు అందించారు. ఆ త‌రువాత‌ సిజేఐ గా కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన, జడ్జీల నియామకంపై వేగం పెంచారు. ఆయ‌న‌ హయాంలో 224 మంది హై కోర్టు న్యాయమూర్తుల నియ‌మించ‌డం గమనార్హం.
శ‌నివారం నాడు 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారంచేయనున్నారు. రాష్ట్రపతి భవన్‍లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయిస్తారు. తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి జస్టిస్ ల‌లిత్ ను ప్ర‌స్తుత చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ రమణ సిఫార్సు చేయ‌డం గ‌మ‌నార్హం. రెండు నెలలా 12 రోజుల సీజేఐగా జస్టిస్ యూయూ లలిత్ ఆ పదవిలో ఉంటారు. నవంబర్ 8వ తేదీతో ఆయన పదవీకాలం ముగుస్తుంది.

పదవీ విరమణకు రోజు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ `ఉచితాలు’, 2007 గోరఖ్‌పూర్ అల్లర్ల కేసు, కర్ణాటక మైనింగ్‌పై నిషేధంపై పిల్ కేసు, రాజస్థాన్ మైనింగ్ లీజు సమస్య, దివాలా చట్టం కింద లిక్విడేషన్ నిబంధనలు అనే కేసుల‌ను విచారించారు.కోర్టుల్లో మౌలిక సదుపాయాలు, న్యాయమూర్తుల నియామకాలపై ప్రత్యేకంగా పని చేశానని జస్టీస్ ఎన్వీరమణ చెప్పారు. సుప్రీంకోర్టు, కొలీజియంలో అన్ని విధాలుగా సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. న్యాయ వ్యవస్థ అవసరాలను తీర్చిదిద్దేందుకు ఎన్వీరమణ విశేషంగా కృషి చేశారని పలువురు న్యాయవాదులు ప్రశంసించారు. భారత ప్రధాన న్యాయమూర్తుల్లో ఎన్వీరమణ అత్యుత్తమమమైనవారని కొనియాడారు. అధ్భుతమైన ప్రగతిశీల దృక్పధం ఉన్న ఆయన న్యాయవ్యవస్థ అవసరాలను వేగంగా తీర్చగలిగారని ప్రశంసించారు.