BJP : బిజెపి లో చేరితే కేసులు లేనట్లేనా..?

బీజేపీతో ఉంటే బెయిలు.. లేకుంటే జైలు అన్న విధానాన్ని కేంద్రం పాటిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 05:26 PM IST

‘ఓ నాయకుడికి వ్యతిరేకంగా సీబీఐ (CBI), ఈడీ (ED) కేసులు పెండింగ్‌లో ఉన్న ఉదంతాలు బోలెడు ఉన్నాయి. ఇలా కేసులు ఉన్న నాయకులు బీజేపీ(BJP)లోకి చేరగానే, ఆ కేసులను మూసివేస్తారు, లేదంటే మూలనపడేస్తారు. బీజేపీలో చేరిన వారందరి కేసులు పరిష్కారమైపోతాయి. వారి పార్టీలో చేరనివారు జైలుకు పోతారు’’ అని ప్రతిపక్ష నేతలు చెపుతూ వస్తున్నారు. 2014 లో బిజెపి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి కూడా ఇతర పార్టీల నేతలపై ఈడీ, సీబీఐ లు కేసులు పెట్టింది. వేల కోట్ల అక్రమ ఆస్తులు బయటపెట్టింది..ఒకానొక సమయంలో వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని అంత భావించారు. కానీ వారంతా బిజెపి లోకి చేరగానే ఆ కేసులన్నీ మాయం అయ్యాయి. వారిపై అప్పటివరకు దాడులు నిర్వహించిన సీబీఐ , ఈడీ సైతం సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి), శివసేన, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), తెలుగుదేశం పార్టీ (టిడిపి), సమాజ్ వాదీ పార్టీ (ఎస్‌పి), వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ఇలా పలు పార్టీల నేతలపై దాడులు జరుగగా..వారంతా బిజెపి లోకి చేరగానే ఆ కేసులన్నీ పక్కకు వెళ్లాయి. ఇప్పటివరకు మళ్లీ ఆ కేసుల ఊసేలేదు.

We’re now on WhatsApp. Click to Join.

బీజేపీ మిత్రపక్షం ఎన్సీపీ (అజిత్‌ పవార్‌ వర్గం) నేత ప్రఫుల్‌ పటేల్‌పై గతంలో నమోదు చేసిన అభియోగాలను సీబీఐ తాజాగా ఉపసంహరించుకుంది. ఇతర పార్టీలలో ఉన్నప్పుడు కళంకితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులు బీజేపీలోగానీ, దాని మిత్రపక్షాలలోగానీ చేరగానే ఎలా పునీతులవుతారని తాజాగా కాంగ్రెస్ (Congress) ప్రశ్నించింది. బీజేపీ ‘వాషింగ్‌ మెషిన్‌’లో వారిని ‘మోదీ వాషింగ్‌ పౌడర్‌’తో కడిగి శుభ్రపరుస్తున్నారా? అని నిలదీసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న హిమంత బిశ్వశర్మ, ముకుల్‌ రాయ్‌, సువేందు అధికారి, నారాయణ్‌ రాణే, అశోక్‌ చవాన్‌ తదితర 21 మంది నేతలు బీజేపీలో చేరగానే వారిపై ఉన్న ఆరోపణలు అన్నీ తొలగిపోయాయని, బీజేపీలో వారికి ఎంతో ప్రాధాన్యం కూడా ఇచ్చారని పవన్‌ఖేరా గుర్తు చేశారు. ఇదే విధంగా దావూద్‌ ఇబ్రహీం బీజేపీ వాషింగ్‌ మెషిన్‌లోకి వెళ్లినా కూడా స్వచ్ఛంగా బయటకు వస్తాడన్నారు.

బీజేపీతో ఉంటే బెయిలు.. లేకుంటే జైలు అన్న విధానాన్ని కేంద్రం పాటిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ దుయ్యబట్టారు. ఓవైపు బీజేపీ ప్రభుత్వం వసూళ్ల దందాకు పాల్పడుతోందని, మరోవైపు ప్రతిపక్షాల బ్యాంకుఖాతాలను స్తంభింపజేస్తూ, విపక్ష సీఎంలను జైలు పాలు చేస్తూ, విమర్శకులను అణచివేస్తూ, ఎన్నికలు కూడా పారదర్శకంగా జరగకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. చూడబోతే దేశాన్ని ఒక ప్రభుత్వం నడుపుతున్నట్లుగా లేదని ఓ క్రిమినల్‌ గ్యాంగ్‌ (నేరగాళ్ల ముఠా) నడుపుతున్నట్లుగా అనిపిస్తోందన్నారు. అందుకే చాలామంది నేతలు తమ ఆస్తులు కాపాడుకోవడం కోసం తమ సొంత పార్టీలను వదిలి తప్పదని బిజెపి లో చేరుతున్నారు.

Read Also : World Bank : 2024లో భారత వృద్ధి రేటు 7.5 శాతం.. ప్రపంచ బ్యాంక్ అంచనా