Site icon HashtagU Telugu

Independence Day : స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌కు ఉగ్ర‌ముప్పు.. హెచ్చ‌రించిన ఇంటెలిజెన్స్ బ్యూరో

I Day Imresizer

I Day Imresizer

స్వాతంత్య్ర దినోత్స‌వ  వేడుక‌ల‌కు ఉగ్ర‌ముప్పు ఉంద‌ని ఇంటిలిజెన్స్ హెచ్చ‌రించింది. రాష్ట్ర రాజధానుల‌తో సహా దేశంలోని సున్నితమైన ప్రాంతాలలో ఉగ్రవాద సంస్థల నుండి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ అధికారులు తెలంగాణ పోలీసులతో సహా అన్ని రాష్ట్రాలకు సర్క్యులర్‌లు అందించారు. ఇటీవలి కాలంలో మతపరమైన అల్లర్లు జరిగిన సున్నితమైన ప్రదేశాలలో అదనపు బలగాలను మోహరించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. నూపూర్ శర్మ వ్యాఖ్యలకు సంబంధించి ఉదయ్‌పూర్, అమరావతిలో జరిగిన సంఘటనలు, ఇతర పరిణామాలను ప్రస్తావిస్తూ ఆగస్టు 15 న వేడుకలలో పాల్గొనేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐబీ అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌కు చెందిన కొందరు అనుమానితులను విచారించారు. ఉదయ్‌పూర్‌లో టైలర్ హత్య కేసులో పాత్ర, నిజామాబాద్ నుండి ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తుండగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు కొంతమంది నిందితులను పట్టుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సున్నిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇంటెలిజెన్స్ అధికారులు తెలంగాణ పోలీసులను కోరారు. రాష్ట్ర పోలీసులు కేవలం స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుకలకు మాత్రమే కాకుండా రాష్ట్రంలో అనుమానాస్పద కదలికలపై వారం రోజుల పాటు నిఘా పెట్టాల‌ని ఐబీ సూచించింది. అనుమానితుల కదలికలపై నిఘా ఉంచాలని, పగలు, రాత్రి పెట్రోలింగ్‌ను పెంచాలని పోలీసు కమిషనర్‌, ఎస్పీలను ఆదేశించారు.