C295 Aircraft: భారత వాయుసేనలోకి సీ-295 విమానం.. ప్రత్యేకతలు ఇవే..!

భారత్ వైమానిక శక్తి మరింత పెరగనుంది. స్పెయిన్ నుంచి తొలి సి-295 సైనిక విమానం (C295 Aircraft) త్వరలో భారత్‌లో ల్యాండ్ కానుంది. విమానాన్ని తీసుకెళ్లేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ స్పెయిన్ చేరుకున్నట్లు సమాచారం.

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 12:59 PM IST

C295 Aircraft: భారత్ వైమానిక శక్తి మరింత పెరగనుంది. స్పెయిన్ నుంచి తొలి సి-295 సైనిక విమానం (C295 Aircraft) త్వరలో భారత్‌లో ల్యాండ్ కానుంది. విమానాన్ని తీసుకెళ్లేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ స్పెయిన్ చేరుకున్నట్లు సమాచారం. గత ఏడాది సెప్టెంబర్‌లో అవ్రో-748 విమానాల స్థానంలో 56 సి-295 విమానాల కోసం ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్‌తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.

స్పెయిన్ నుంచి భారత్‌కు 16 సీ-295 విమానాలు లభిస్తాయి. కాగా, మిగిలిన 40 విమానాలను గుజరాత్‌లోని వడోదరలో ఉత్పత్తి చేయనున్నారు. సెప్టెంబర్ 25న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో విమానం ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 21 వేల కోట్లకు భారత్ ఈ డీల్ చేసింది. ఒప్పందం ప్రకారం 4 సంవత్సరాలలో 16 విమానాలను పంపిణీ చేయాలి.

మే 2024 నాటికి భారతదేశం రెండవ C-295 విమానాన్ని పొందుతుందని అధికారులు తెలియజేసారు. అదే సమయంలో మొత్తం 16 విమానాలు ఆగస్టు 2025 నాటికి భారత వైమానిక దళానికి పంపిణీ చేయబడతాయి. భారతదేశంలో తయారు చేయబోతున్న మొదటి స్వదేశీ విమానం సెప్టెంబర్ 2026 నాటికి డెలివరీ చేయబడుతుంది. మిగిలిన 39 విమానాలు ఆగస్టు 2031 నాటికి డెలివరీ చేయబడతాయని భావిస్తున్నారు.

Also Read: Jr NTR: కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్, ఎందుకో తెలుసా!

గతేడాది అక్టోబర్ 30న నిర్మాణ ప్లాంట్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇక్కడ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, ఎయిర్‌బస్ డిఫెన్స్, స్పేస్ S.A C-295 విమానాలను తయారు చేస్తాయి. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారతదేశంలో ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారు చేయనున్న ఈ రకమైన మొదటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.21,935 కోట్లు. ఈ విమానాన్ని పౌర అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు.

విమానం లక్షణాలు

5-10 టన్నుల సామర్థ్యం కలిగిన ఈ రవాణా విమానం అనేక సందర్భాల్లో వివిధ మిషన్లను నిర్వహించగలదని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 11 గంటల పాటు ఎగరడంతోపాటు తక్కువ ఎత్తులో టేకాఫ్, ల్యాండింగ్ చేసే ఫీచర్ ఇందులో ఉంది. ప్రత్యేక విషయమేమిటంటే.. ఇది ఎడారి నుండి సముద్ర వాతావరణాలలో పగలు, రాత్రి పోరాట కార్యకలాపాలను క్రమం తప్పకుండా నిర్వహించగలదు. C-295 9 పేలోడ్‌లు లేదా 71 మంది సైనికులు లేదా 45 పారాట్రూపర్‌లను మోసుకెళ్లగలదు. అలాగే, ఇది గంటకు గరిష్టంగా 480 కి.మీ వేగంతో మిషన్లను నిర్వహించగలదు.

మొత్తం 56 విమానాలు భారతీయ DPSUలు – భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన స్వదేశీ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌లతో అమర్చబడి ఉంటాయని ప్రభుత్వం తెలియజేసింది. భారత వైమానిక దళానికి 56 విమానాల డెలివరీ పూర్తయిన తర్వాత, ఎయిర్‌బస్ డిఫెన్స్, స్పేస్ భారతదేశంలో తయారు చేయబడిన విమానాలను సివిల్ ఆపరేటర్లకు విక్రయించడానికి, వాటిని భారత ప్రభుత్వం ఆమోదించిన దేశాలకు ఎగుమతి చేయడానికి అనుమతించబడతాయి.