ఢిల్లీ ఎర్రకోట సమీపంలో నవంబర్ 10న చోటుచేసుకున్న కారు పేలుడు ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ పేలుడులో 13 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం, 20 మందికి పైగా గాయపడటం దేశ భద్రతా వ్యవస్థను కొత్త ప్రశ్నల ఎదుట నిలబెట్టింది. ఈ ఘటన ఉగ్రవాదుల దీర్ఘకాల కుట్రలో భాగమేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా, దీనిపై దర్యాప్తు చేపట్టిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కీలక ఆధారాలు బయటపెడుతోంది. కారు పేలుడులో ఉపయోగించిన i-20 వాహనం కాశ్మీర్‌కు చెందిన అమీర్ రషీద్ అలీ పేరుతో రిజిస్టర్ కావడం, అతను ఈ దాడి సూత్రధారి ఉమర్ ఉన్ నబీకి సన్నిహిత అనుచరుడు కావడం దర్యాప్తులో బయటపడిన ముఖ్యమైన అంశాలు. అమీర్ రషీద్ కారు కొనుగోలు, పేలుడు ప్రణాళికలో కీలక పాత్ర పోషించినట్లు ఎన్ఐఏ ధృవీకరించింది.
Drinking Water: రోజులో ఒక లీటర్ కంటే తక్కువ నీరు తాగుతున్నారా.. అయితే మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే!
కేసు దర్యాప్తు లో భాగంగా NIA నవంబర్ 16న ఢిల్లీలో అమీర్ రషీద్‌ను అరెస్టు చేసింది. ఫోరెన్సిక్ నివేదికల ప్రకారం, పేలుడు జరిగిన సమయంలో కారును నడిపింది ఉగ్రవాదిగా గుర్తించిన ఉమర్ ఉన్ నబీ అని బయటపడింది. అతను పుల్వామాకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్, అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పని చేసిన సమాచారమూ దర్యాప్తులో లభించింది. అమీర్, ఉమర్ కలిసి ఉగ్రదాడులను ప్రణాళిక చేసినట్లు, దీపావళి రోజున భారీ ఉగ్రదాడి చేయాలనే యత్నించినప్పటికీ, చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు NIA వర్గాలు వెల్లడించాయి. రిపబ్లిక్ డే ను లక్ష్యంగా పెట్టుకొని మరింత పెద్ద దాడి కోసం సిద్ధమవుతున్నారని నిందితుల వాంగ్మూలాల ద్వారా అధికారం అనుమానం వ్యక్తం చేస్తోంది.
NIA ఇప్పటివరకు 73 మంది సాక్షులను ప్రశ్నించడంతో పాటు, మరో కారును సహా అనేక డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో కలిసి మల్టీ-ఏజెన్సీ దర్యాప్తును విస్తరించింది. ఈ దాడి వెనుక అంతర్రాష్ట్ర నెట్‌వర్క్, విదేశీ సంబంధాలు ఉన్నట్లు కనిపిస్తున్నందున, దర్యాప్తు ఇంకా మరింత విస్తృతం కానుందని అధికారులు అంటున్నారు. మొత్తం ఘటన భారత రాజధానిపై ఉగ్రవాదం మళ్లీ చేతులు చాచి ఉందనే సంకేతాన్ని స్పష్టంగా ఇస్తోంది. దేశ భద్రతను సవాల్ చేస్తున్న ఈ వైట్ టెర్రర్ మాడ్యూల్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి కేంద్ర దర్యాప్తు సంస్థ వేగంగా చర్యలు తీసుకుంటోంది.
