IT Notice : కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన ఐటీ శాఖ‌

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 02:16 PM IST

IT Notice To Congress: ఆదాయపు పన్ను విభాగం కాంగ్రెస్​కు రూ.1700 కోట్ల పన్నుకు సంబంధించి మరోమారు నోటీసులు జారీ(Notices Issuance) చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత వివేక్‌ తంఖా(Vivek Tankha) శుక్రవారం వెల్లడించారు. 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1700 కోట్ల డిమాండ్‌ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఇక ఇదే అంశంపై ఐటీ విభాగం ప్రక్రియను నిలిపివేయాలంటూ పార్టీ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన మరుసటి రోజే ఈ పరిణామం జరగడం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఎలాంటి మదింపు ఉత్తర్వులు, పత్రాలు లేకుండానే గురువారం తాజా నోటీసులిచ్చినట్లు వివేక్‌ తంఖా ఆరోపించారు. ఇది అహేతుక, అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. దీనిని తాము చట్టపరంగా సవాల్‌ చేస్తామని పేర్కొన్నారు.

Read Also:Sunita Kejriwal : నా భ‌ర్త‌కు మ‌ద్ద‌తు ఇవ్వండి..వాట్సాప్ నెంబ‌ర్ షేర్ చేసిన కేజ్రీవాల్ భార్య

2017-2021 కాలానికి సంబంధించి ఐటీ విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను ఆపేయాలని కాంగ్రెస్‌ ఇటీవలే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం న్యాయస్థానం కొట్టేసింది. మదింపు ప్రక్రియను చేపట్టేందుకు ఐటీ అధికారుల వద్ద అవసరమైన ఆధారాలు ఉన్నాయని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. అంతకుముందు 2014-15 నుంచి 2016-17 మధ్య కాలానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన పునఃపరిశీలననూ సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్​లను కూడా ఇవే కారణాలతో దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇక ఈ పునఃపరిశీలనకు సంబంధించి కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాల నుంచి ఇప్పటికే రూ.135 కోట్లను ఐటీ విభాగం రికవరీ చేసింది. కాగా, ఒకవైపు లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్​కు వరుసగా ఈ ఎదురుదెబ్బలు తగులుతుండటం ఆ పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురించేస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, తమ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవలే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింప​ చేసి ప్రజాస్వామ్యానికి కేంద్రం తీవ్ర నష్టం కలిగించిందని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలు కాంగ్రెస్‌ పార్టీపైనే కాక, ప్రజాస్వామ్యంపైనా ప్రభావం చూపనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.