By: డా. ప్రసాదమూర్తి
I.N.D.I.A Alliance vs BJP : దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్క తాటిపైకి రావడానికి కసరత్తులు జోరుగా సాగుతున్నాయి. కేంద్రంలో గత పదేళ్ళుగా అధికారం చెలాయిస్తూ ఏకవర్ణం, ఏక మతం, ఏక దేశం అంటూ భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్న బిజెపికి, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి శత్రువులు అందరూ కలిసి మిత్రులవుతున్న సందర్భం ఇప్పుడు దేశమంతా చూస్తోంది. శత్రువులు అని ఎందుకు అంటున్నానంటే, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా (I.N.D.I.A) ఉన్నప్పటికీ, అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ ప్రధాన శక్తిగా కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాల్లో తలెత్తిన ప్రాంతీయ పార్టీలకు కీలకమైన పోటీ కాంగ్రెస్ తోనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయా ప్రాంతీయ పార్టీలు, పలు జాతీయ పార్టీలు, వామపక్షాలు అన్నీ కాంగ్రెస్తో కలిస్తేనే తప్ప ఒక ప్రతిపక్ష ఐక్య సంఘటన సాధ్యం కాదు. ఇది ఎలా సాధిస్తారు అన్నది ఈ దేశంలోని కోట్ల మంది మెదళ్ళలో మెదిలే ప్రశ్న.
ఇప్పటికే పాట్నాలో, బెంగళూరులో దాదాపు పాతిక పైచిలుకు ప్రతిపక్ష పార్టీలు ఒక వేదిక మీద సమావేశమై, దేశవ్యాప్త ఐక్య సంఘటనకు సాధ్యాసాధ్యాలను చర్చించిన విషయం మనకు తెలిసిందే. ఆగస్టు 31న ముంబైలో ముచ్చటగా మూడోసారి సమావేశం అవుతున్నారు. అంతా బాగానే ఉంది గాని, వీరందరూ కలిస్తే బిజెపిని ఓడించడానికి ఒక శక్తిగా ఎదిగే అవకాశం కూడా ఉండవచ్చు గాని, దేశంలో రాజకీయ పరిస్థితుల రీత్యా వివిధ పార్టీల బలాబలాల రీత్యా ఇది సాధ్యపడే విషయమేనా అన్న సందేహం మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది. కారణం ఢిల్లీ నుంచి తెలంగాణ.. కేరళ వరకు అనేక రాష్ట్రాల్లో ఆయా ప్రాంతీయ శక్తులతో తలపడేది కాంగ్రెస్ పార్టీనే. మరి కాంగ్రెస్ పార్టీతో ఇతర పార్టీలన్నీ చేతులు కలపాలంటే తమ తమ రాష్ట్రాల్లో ఆ పార్టీతో ఉన్న పోటీని ఎలా మిత్ర వైరుధ్యంగా మార్చుకోగలుగుతారు అన్నదే పెద్ద సవాలు.
ఇదే విషయం మీద పలు దఫాలుగా పార్టీలు పార్టీలు వారీగా చర్చలు జరుపుతున్నట్టు ప్రతిపక్ష ఐక్యతకు సూత్రధారిగా వ్యవహరిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పదేపదే చెబుతూ వస్తున్నారు. వీరి చర్చలు ఎంతవరకు ఫలించాయి, అవి ఒక కొలిక్కి చేరుకున్నాయా, అడ్డుపడుతున్న అంశాలు ఏమిటి అనేది ఇంకా ఇదమిత్థంగా తేలలేదు. కాంగ్రెస్ తో ఇతర ప్రతిపక్ష పార్టీల (I.N.D.I.A) ఐక్యత, కేంద్రంలో అధికారం విషయంలోనే గాని ఆయా రాష్ట్రాలలో ఎన్నికల విషయంలో కాదని ఆ పార్టీలు చెబుతున్నప్పటికీ, కాంగ్రెస్ తో రాష్ట్రాలలో తలపడి, ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకొని, సార్వత్రిక ఎన్నికలలో మాత్రం చేయి చేయి కలిపి భాయి భాయి అని ఎలా అనగలరు? అది ఎంత ఆచరణ యోగ్యమో మనం చూడడానికి ఇంకా ఎంతో కాలం లేదు. కేవలం ఎనిమిది నెలలు మాత్రమే సార్వత్రిక ఎన్నికలకు సమయం ఉంది. ఇంత తక్కువ కాలంలో ప్రతిపక్షాలు ఎలా ఐక్యత సాధిస్తాయో తెలియదు.
అంతకుమించి అతిపెద్ద ప్రశ్న ప్రతిపక్షాలు ఏకమైతే ప్రధాని అభ్యర్థి ఎవరు అనేది. దీనికి సమాధానంగా ప్రధాని అభ్యర్థి ఎవరు అని ఎందుకు ముందుగానే ప్రకటించాలి? విజయం సాధించాక మా కూటమిలో బలాబలాలు చూసుకుని అర్హుడైన వ్యక్తినే ప్రధానిగా ఎంచుకుంటామని ప్రతిపక్షాలు చెప్పవచ్చు. కానీ సత్యం చెబుతున్న విషయం మరొకటి ఉంది. అది ఏమిటంటే ప్రతిపక్షాలలో కొందరు కీలకమైన నాయకులు నేనంటే నేను ప్రధానికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థిని అని స్వయంగా ప్రకటించుకుంటున్న వాళ్ళున్నారు. మరి ఈ వైరుధ్యాన్ని ఈ సమస్యను ప్రతిపక్షాలు (I.N.D.I.A) ఎలా పరిష్కరించుకుంటాయి? అదే పెద్ద ప్రశ్న. దాదాపు నలుగురయితే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి పోటీగా ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో నిలిచే అవకాశం ఉంది. ప్రధాన సూత్రధారి నితీష్ కుమార్ ముందు ఉంటారు. ఆ తర్వాత వరుసలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నాకేం తక్కువ అంటారు. అసలు దేశంలో దళితులంతా ఏకం కావాలంటే నేను ఉంటే తప్ప వీలు కుదరదని మాయావతి మొరాయించవచ్చు. అరే, ప్రధాని కావాలంటే పనిచేసి చూపించాలి. ఇదిగో ఢిల్లీలో నేను చేశాను చూడండి అని కేజ్రీవాల్ ముందుకు వస్తారు. ఇక మమతమ్మ మదిలో ఏముందో మనకు తెలియదు. ఇలా ఎవరికి వారు తానే ప్రధాని కావాలనుకునే సెల్ఫ్ సెంటర్డ్ పొలిటీషియన్స్ ప్రతిపక్షంలో తక్కువేమీ లేరు. అసలు సమస్య ఇదే.
ప్రతిపక్షాలు మొత్తం కలిస్తే వారు సాధించే సీట్లలో కాంగ్రెస్ వాటా అత్యధికంగా ఉన్నప్పటికీ కూడా ప్రధాని పదవికి తొడగొట్టి పోటీపడే గట్టి మల్ల యోధులు మాటేమిటి? ఎవరిని ఎవరు బుజ్జగించగలరు? ఈ సమస్యను ఎన్నికలకు ముందే, సీట్ల ఒప్పందానికి ముందే పరిష్కరించుకోకపోతే, ఒకవేళ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించినా.. అది కుక్కలు చింపిన విస్తరి కాగలదు. అందుకే ప్రతిపక్షాల మధ్య సయోధ్య సాధ్యమేనా అన్నది కోట్ల మంది భారతీయులు వేస్తున్న ప్రశ్నగా భావించాలి. ఈ ప్రశ్నకు ఆచరణ సాధ్యమైన, అందరికీ ఆమోదయోగ్యమైన సమాధానం చెప్పగలిగే స్థితిలో ప్రతిపక్షాలు ఉండాలి. అలాంటి స్థిరమైన స్థితికి ప్రతిపక్షాలు చేరుకున్నాయన్న నమ్మకం కుదిరితే తప్ప వారి వెనక ప్రజలు నిలబడరు.
Also Read: ISRO Missions : విజ్ఞానం అంగారక గ్రహానికి.. అజ్ఞానం పాతాళానికి