CJI Chandrachud : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధనంజయ వై.చంద్రచూడ్ పదవీ కాలం నవంబరు 10తో ముగియనుంది. భూటాన్‌లోని ‘జేఎస్‌డబ్ల్యూ స్కూల్ ఆఫ్ లా’లో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా సీజేఐ ప్రసంగిస్తూ తన పదవీ విరమణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘గత రెండేళ్లుగా నేను అకుంఠిత దీక్షతో పనిచేశాను. నా ప్రొఫెషన్‌కు న్యాయం చేసే సంకల్పంతో సేవలు అందించాను. ఉదయం నిద్రలేచిన దగ్గరి నుంచి నిద్రపోయే వరకు ఉద్యోగంపై సంపూర్ణ నిబద్ధతతో వ్యవహరించాను. అంకితభావంతో న్యాయ సేవలు అందించాననే భావన రోజూ రాత్రి నాకు మంచినిద్రను ఇచ్చేది. నా దేశానికి అత్యంత అంకితభావంతో సేవలు అందించినందుకు గర్వంగా ఉంది’’ అని సీజేఐ చంద్రచూడ్ చెప్పుకొచ్చారు.
Also Read :Harsh Goenka Vs Ola Boss : ‘కమ్రా’ నుంచి ‘క్రమా’కు ఓలా నడుపుతాను : హర్ష్ గోయెంకా
భూటాన్ పర్యటన సందర్భంగా ఆ దేశ యువరాణి సోనమ్ దేచన్ వాంగ్‌చుక్, భూటాన్ ప్రధాన న్యాయమూర్తి లియోన్‌పో చోగ్యాల్ డాగో రిగ్జిన్‌లతో సీజేఐ డీవై చంద్రచూడ్ భేటీ అయ్యారు. అక్కడి లా గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి సీజేఐ మాట్లాడుతూ.. వ్యక్తిగత విలువతో లా ప్రొఫెషన్‌లో ముందుకు సాగాలన్నారు. సమున్నత ఆశయాలతో జీవిత లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశం, భూటాన్ వంటి దేశాలకు సంప్రదాయ విలువలే పునాది అని చెప్పారు. ఆధునికతను అందిపుచ్చుకుంటూనే సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వాతావరణ మార్పులు, పర్యావరణ చట్టాలపై జేఎస్‌డబ్ల్యూ స్కూల్ ఆఫ్ లా ప్రవేశపెట్టబోయే ఎల్ఎల్ఎం కోర్సు ఈ ప్రాంతంలో పర్యావరణ స్పృహ కలిగిన న్యాయవాదులను సిద్ధం చేస్తుందని సీజేఐ చంద్రచూడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సామాజిక మార్పును సాధించేందుకు న్యాయాన్ని మించిన మహత్తర సాధనం మరొకటి లేదన్నారు. మరింత మంది యువత లీగల్ ప్రొఫెషన్‌లోకి రావాల్సిన అవసరం ఉందని సీజేఐ (CJI Chandrachud) తెలిపారు.