భారతీయ రైల్వేలు ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు కొత్త కొత్త ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నాయి. వందే భారత్ వంటి ఆధునిక రైళ్ల తర్వాత, ఇప్పుడు హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైళ్ల(Hydrogen Train)ను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఈ పర్యావరణహిత రైళ్లు నీటి నుండి ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్‌తో నడుస్తాయి. ఈ రైలు ఇప్పటికే హర్యానాలో ట్రయల్ దశను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇది జింద్ మరియు పానిపట్ మధ్య 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. రైల్వే శాఖ యొక్క 2030 నాటికి సున్నా కార్బన్ ఉద్గారాల లక్ష్యానికి ఇది ఒక కీలక అడుగుగా నిలవనుంది.
హైడ్రోజన్ రైళ్లు ఇప్పటికే జర్మనీ, చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి పలు దేశాలలో అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్ల నుండి ఎలాంటి కార్బన్ ఉద్గారాలు విడుదల కాకపోవడంతో వీటిని ‘సున్నా ఉద్గారాల రైళ్లు’ అని పిలుస్తారు. విదేశాల్లో వీటి ఛార్జీలు దేశాన్ని బట్టి మారుతుంటాయి. ఉదాహరణకు జర్మనీలో కిలోమీటరుకు సుమారు రూ. 7, చైనాలో రూ.5- రూ.7, జపాన్‌లో రూ.10-రూ.15 వరకు ఛార్జీలు ఉన్నాయి. అమెరికాలో కూడా కిలోమీటరుకు రూ.12-రూ.15 వరకు ఛార్జీలు ఉండవచ్చని అంచనా. ఈ విదేశీ ధరలను బట్టి భారత్‌లో కూడా ధరలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తిగా ఉన్నారు.
Defamation case : రాహుల్ గాంధీకి ఊరట..అమిత్ షాపై వ్యాఖ్యల కేసులో బెయిల్ మంజూరు
అయితే, భారతదేశంలో హైడ్రోజన్ రైళ్ల ఛార్జీలు సామాన్య ప్రజల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని నిర్ణయించబడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఛార్జీలు స్లీపర్ తరగతి రైళ్ల కంటే కొంచెం ఎక్కువ ఉండవచ్చని, కానీ విమాన ఛార్జీలంత ఎక్కువగా ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది ట్రయల్ దశలో ఉండటంతో ఖచ్చితమైన ధరలను వెల్లడించడం కష్టం. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును పైలట్ ప్రాజెక్టుగా పరిగణిస్తోంది. ఇప్పటికే ఉపయోగంలో ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లను (DEMU) హైడ్రోజన్ ఇంధనానికి అనుకూలంగా మార్చే ప్రక్రియ మొదలైంది.
రైల్వే శాఖ భవిష్యత్తులో 35 హైడ్రోజన్ రైళ్లను నడపాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒక్కో రైలు తయారీకి సుమారు రూ.80 కోట్లు, మౌలిక సదుపాయాలకు మరో రూ.70 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ రైళ్లను ప్రధానంగా కొండ ప్రాంతాల్లో ఉన్న వారసత్వ మార్గాల్లో నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ కొత్త రైళ్లతో పర్యావరణ పరిరక్షణతో పాటు, ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించడం అనేది భారతీయ రైల్వేల ముఖ్య ఉద్దేశ్యం. హైడ్రోజన్ రైళ్లు భారతీయ రైల్వేల భవిష్యత్తును మరింత సుస్థిరం చేయగలవని చెప్పవచ్చు.