Murder: హైదరాబాద్ జీడిమెట్లలో ఓ అమాయక తల్లి దారుణ హత్యకు గురైన కేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. సోషల్ మీడియా పరిచయం… ప్రేమగా మారి, చివరకు ఒక కన్న తల్లిని హత్య చేసేందుకు దారితీసిన ఈ ఘటన మానవ సంబంధాల విలువల్ని ప్రశ్నించేలా ఉంది.
ఈ ఘటనకు కేంద్రబిందువుగా నిలిచినది పదో తరగతి చదువుతున్న ఒక బాలిక. ఎనిమిది నెలల క్రితం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నల్గొండకు చెందిన యువకుడు శివతో పరిచయం ఏర్పడింది. యువతితో రోజు రోజుకీ సమాధానాలు పెరిగి, అది ప్రేమగా మారింది. విషయం తెలిసిన తల్లి అంజలి, “ఇప్పుడే పదో తరగతిలో ఉన్నావు, ఇలాంటి విషయాలు అవసరమా?” అంటూ మందలించింది. తల్లి అడ్డుపడుతుండటంతో ఈ బాలిక ఆమెను తన ప్రేమ బంధానికి ఆటంకంగా భావించింది.
ఇటీవల వారం రోజుల క్రితం బాలిక తన ఇంటినుంచి శివతో కలిసి వెళ్లిపోయింది. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అయిన మూడురోజుల తర్వాత బాలిక తిరిగి ఇంటికి వచ్చింది. కానీ అప్పటికే ఆమె మనసులో తల్లిని తొలగించాలనే భీకర ఆలోచన వాస్తవ రూపం దాల్చింది.
నిన్న సాయంత్రం నల్గొండ నుంచి శివ హైదరాబాదుకు వచ్చాడు. అప్పుడు అంజలి ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉండగా శివ వెనుక నుంచి ఆమెపై దాడి చేశాడు. అతడు బెడ్‌షీట్‌తో ఆమె ముఖాన్ని కప్పగా, బాలిక తల్లి తలపై సుత్తితో కొట్టింది. అనంతరం శివ తమ్ముడు యశ్వంత్ కత్తితో ఆమె గొంతు కోసాడు. ఇలా ముగ్గురు కలిసి తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, హతురాలు అంజలి స్వాతంత్ర్య సమరయోధురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు కావడం. దేశం కోసం పోరాడిన కుటుంబం నుంచి వచ్చిన మహిళను, ఆమె సొంత కూతురు ప్రేమ పేరుతో హత్య చేయడం సమాజాన్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.
ప్రస్తుతం జీడిమెట్ల పోలీసులు ఈ హత్య కేసును విచారిస్తూ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సమాజంలో మారుతున్న విలువలు, తల్లిదండ్రుల పట్ల అభద్రతాభావం, చిన్న వయసులోనే ప్రేమ బంధాల్లో ఇరుక్కొనడం.. ఇవన్నీ కలసి ఇలా అమానుష ఘటనలకు దారితీస్తున్నాయి. ఈ ఘటన ప్రతి తల్లిదండ్రిని, విద్యార్థిని ఆలోచించాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టింది.
Headingley Test: లీడ్స్ చరిత్రలో అత్యధికంగా చేజ్ చేసిన స్కోర్లు ఇవే!