Population Census: జ‌నాభా లెక్కల‌కు చిక్కులు త‌ప్పవా? సామాజికవర్గాల లెక్కలపై చిక్కులెందుకు?

దేశంలో జ‌నాభా లెక్కల సేక‌ర‌ణకు ఈ సారి ఇబ్బందులు ఎదురయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ప్రతి ప‌దేళ్లకు ఒక సారి జ‌నాభా వివ‌రాల‌ను న‌మోదు చేస్తుంటారు.

  • Written By:
  • Publish Date - February 27, 2022 / 10:30 AM IST

దేశంలో జ‌నాభా లెక్కల సేక‌ర‌ణకు ఈ సారి ఇబ్బందులు ఎదురయ్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ప్రతి ప‌దేళ్లకు ఒక సారి జ‌నాభా వివ‌రాల‌ను న‌మోదు చేస్తుంటారు. నిజానికి ఇవి 2020 ఏప్రిల్‌-సెప్టెంబ‌రు మ‌ధ్య జ‌ర‌గాల్సి ఉన్నా క‌రోనా కార‌ణంగా నిరవ‌ధికంగా వాయిదా ప‌డ్డాయి. ఇప్పుడు కొవిడ్ త‌గ్గుముఖం ప‌ట్టడంతో మ‌ళ్లీ నిర్వహించ‌డానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. కానీ ఈసారి బీసీల లెక్కపై చిక్కుముడి ఏర్పడింది.

ఈసారి పాపులేష‌న్ సెన్సస్ స‌మ‌యంలో ఇబ్బందుల‌తో పాటు, ఆందోళ‌న‌లు కూడా జ‌రిగే సూచ‌న‌లు ఉన్నాయి. ముఖ్యంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌ను గుర్తిస్తూ విడిగా లెక్కలు రాయాల‌న్న డిమాండ్లు ఊపందుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఓబీసీ కులాల జాబితాను త‌యారు చేసి.. వాటిని ఏ,బీ,సీ,డీలుగా వ‌ర్గీక‌రించ‌నుండ‌డంతో ఈ డిమాండుకు మ‌రింత ప్రాధాన్యం క‌ల‌గ‌నుంది.

కులాల వారీగా జ‌నాభా లెక్కల‌ను తీసి, విడిగా ఓబీసీ వివ‌రాలు సేక‌రించాల‌ని ఇప్పటికే డిమాండ్లు వ‌స్తున్నాయి. దీనిపై బిహార్‌, ఒడిశా వంటి అసెంబ్లీల్లో తీర్మానాలు కూడా చేశారు. ఎస్పీ, ఆర్జేడీ వంటి పార్టీలు దీన్ని పొలిటిక‌ల్ ఇష్యూగా మార్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వ స్టాండ్ ఏమిట‌న్నది తేల‌కుంటే జ‌నాభా లెక్కల సేక‌ర‌ణ స‌మ‌యంలో ఇబ్బందులు త‌ప్పేలా లేవు.

నేష‌న‌ల్ పాపులేష‌న్ రిజిస్టర్‌పైనా అభ్యంత‌రాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇది అమ‌ల‌యితే పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం కింద త‌మ‌కు స‌మ‌స్యలు వ‌స్తాయ‌ని ముస్లింలు భ‌య‌ప‌డుతున్నారు.వారు కూడా ఆందోళ‌న చేయ‌డంతో పాటు, కోర్టుల‌కు వెళ్లే అవ‌కాశం ఉంది. వీటిపై ఇప్పటికే సెన్సన్ విభాగం ఉన్నతాధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఇలాంటి స‌మ‌స్యలు వ‌స్తే ఎలా వ్యవ‌హ‌రించాల‌నేదానిపై కింది స్థాయి అధికారుల‌కు గైడ్‌లైన్స్ పంపించారు.