Site icon HashtagU Telugu

Gold : ఒడిశాలో భారీ బంగారు నిక్షేపాలు..జీఎస్ఐ కీలక ప్రకటన

Huge gold deposits in Odisha.. GSI's key announcement

Huge gold deposits in Odisha.. GSI's key announcement

Gold : ఒడిశాలో భారీ స్థాయిలో బంగారు ఖనిజ నిక్షేపాలు వెలుగులోకి వచ్చినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సుమారు 10 నుంచి 20 మెట్రిక్ టన్నుల వరకు బంగారు నిల్వలు ఉన్నట్లు ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్న వేళ, ఈ ప్రకటన రాష్ట్రం కాకుండా దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తోంది. ఈ నిక్షేపాల వెలికితీతకు సంబంధించిన పరిశోధనలు జీఎస్ఐతో పాటు ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ సంయుక్తంగా చేపట్టాయి. ఇప్పటికే సుందర్‌గఢ్, నవరంగ్‌పూర్, కియోంజర్, దేవగఢ్ జిల్లాల్లో బంగారు తవ్వకాలు వేగంగా కొనసాగుతున్నాయి. తాజాగా మరో కీలక విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మయూర్ భంజ్, మల్కాన్ గిరి, సంబల్‌పూర్, బౌద్ జిల్లాల్లో కూడా బంగారు నిల్వలు ఉన్న అవకాశముందని, అక్కడ సమగ్రంగా సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నిక్షేపాలున్న ముఖ్య ప్రాంతాలు ఇవే..

మయూర్ భంజ్ జిల్లా: ఝాసిపూర్, సూర్యాగుడా, రువంశి, ఇదెల్కుచా, మారెడిమి, సులేపట్, బడం పహాడ్
దేవగఢ్ జిల్లా: ఆదసా – రాంపల్లి
కియోంజర్ జిల్లా: గోపూర్, గజీపూర్, మంకాడ్ చువాన్, సలేకానా, దిమిరి ముండా
ఇతర జిల్లాలు: మల్కాన్ గిరి, సంబల్‌పూర్, బౌద్

ఈ ప్రాంతాల్లోని నేల, రాళ్లు, మరియు శిలల్లో బంగారు ఖనిజాల వృద్ధి గణనీయంగా ఉండటాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు, దీనిని దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా భావిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న నిక్షేపాల పరిమాణం దేశంలోని కొన్ని ప్రాచీన బంగారు గనులకు సరితూగే స్థాయిలో ఉంది అని జీఎస్ఐ వర్గాలు వెల్లడించాయి.

ప్రజల్లో ఉత్సాహం, ప్రభుత్వం సిద్ధంగా

ఒడిశాలో ఈ సద్వార్త వినగానే స్థానిక ప్రజలు హర్షాతిరేకాలతో స్పందిస్తున్నారు. ఇది రాష్ట్రానికి కొత్త ఆర్ధిక విప్లవానికి నాంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ వర్గాలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. మైనింగ్, ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ముందునుంచే కొత్త విధానాలపై పనిచేస్తోంది.

విశ్వవ్యాప్త మార్కెట్‌లో ఒడిశా పసిడి

బంగారం ధరలు అంతర్జాతీయంగా పెరిగిపోతున్న తరుణంలో, ఒడిశాలో ఈ నిల్వల వెలుగులోకి రావడం రాష్ట్రానికి అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేక గుర్తింపును తెచ్చే అవకాశం కల్పిస్తోంది. ఇది దేశం మొత్తానికీ అర్ధిక ప్రోత్సాహంగా మారుతుంది అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.