అల్మోరా / హర్యానా / ఢిల్లీ। ఢిల్లీ పేలుడు (Delhi blast) కేసుపై దర్యాప్తు వేగంగా సాగుతున్న నేపథ్యంలో, దేశంలో వరుసగా పేలుడు పదార్థాలు దొరికిపోవడం కుదుపు రేపుతోంది. ఇటీవల హర్యానా ఫరీదాబాద్‌లో 2,900 కిలోల పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఇవి అల్-ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన ఉగ్రవాద సంబంధిత డాక్టర్ల స్థలాల్లో దొరికాయి. ఈ నేపధ్యంలో దర్యాప్తు సంస్థలు, ఫోరెన్సిక్ టీములు, డాగ్ స్క్వాడ్స్ మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నాయి.
ఈ క్రమంలో హర్యానా–ఉత్తరాఖండ్ సరిహద్దులోని అల్మోరా జిల్లాలో కూడా 20 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. జిల్లాలోని సాల్ట్ ఏరియాలో రెండు పాఠశాలలకు సమీపంలోని పొదల్లో ఇవి దాగి ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అక్కడ వెంటనే అలర్ట్ ప్రకటించారు.
ఒక పాఠశాలలో క్రికెట్ ఆడుతున్న విద్యార్థులు బాల్ కోసం వెతుకుతూ ఉండగా, పొదల్లో 161 జిలెటిన్ స్టిక్స్ కనిపించాయి. వెంటనే వారు పాఠశాల యాజమాన్యానికి తెలియజేశారు. పోలీసులు వచ్చి మొత్తం స్టాకును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. శాంపిళ్లు తీసుకుని ఎవరు ఈ స్టిక్స్‌ను అక్కడ దాచారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
దబ్రా గ్రామ సర్పంచ్ అర్జున్ సింగ్ ప్రకారం—గతేడాది గ్రామంలో జరిగిన రోడ్డు ప్రాజెక్టులో పని చేసిన కార్మికులు రాళ్లు పగలగొట్టడానికి తెచ్చిన పదార్థాలని, ఉపయోగం పూర్తయ్యాక అక్కడే వదిలి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కార్మికుల శిబిరం ఆ ప్రాంతం నుంచి కేవలం 30 మీటర్ల దూరంలోనే ఉంది. అయితే పోలీసులు మాత్రం ఉగ్రవాద కోణాన్నికూడా సహా అన్ని దిశల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఢిల్లీలో ఎర్రకోట వద్ద కారు పేలుడుకేసులో ఎన్ఐఏ దర్యాప్తు విస్తృతంగా సాగుతోంది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌తో సంబంధం ఉన్న వైట్-కాలర్ టెర్రర్ మాడ్యూల్ దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు బయటపడింది. అరెస్టయిన ఉగ్రవాది డాక్టర్ ముజామ్మిల్ షకీల్ 2023 నుంచే పేలుళ్లకు సిద్ధమవుతున్నట్లు చెప్పినట్టు సమాచారం.
పేలుడు పదార్థాలు తయారు చేయడానికి అవసరమైన యూరియా, అమోనియం నైట్రేట్ కొనుగోలు బాధ్యత ముజామ్మిల్‌దే. అతడు రూ.3 లక్షల విలువ చేసే 26 క్వింటాళ్ల నైట్రోజన్–ఫాస్ఫేట్–పొటాషియం రసాయనాలు గురుగ్రామ్, నూహ్ ప్రాంతాల్లో కొనుగోలు చేసినట్టు విచారణలో బయటపడింది. అదేవిధంగా ఫరీదాబాద్‌లోని రెండు మార్కెట్ల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలు తెచ్చుకున్నాడు. రసాయనాలను ఖచ్చితమైన ఉష్ణోగ్రతల్లో నిల్వచేయడానికి డీప్ ఫ్రీజర్ కూడా కొనుగోలు చేసినట్టు విచారణ అధికారులు గుర్తించారు.
దేశవ్యాప్తంగా అనుమానాస్పద పేలుడు పదార్థాలు వరుసగా దొరకడం, స్కూల్‌ల పక్కనే స్టాకులు దాచడం… ఉగ్రవాదుల రహస్య కుట్ర ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో చూపిస్తున్నదని భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
