Maharashtra Politics : మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఔట్‌?

మ‌హారాష్ట్ర సంకీర్ణ ప్ర‌భుత్వం కూలిపోవ‌డానికి సిద్ధంగా ఉంది. సుమారు 23 మంది శివ‌సేన ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారు. అ

  • Written By:
  • Publish Date - June 21, 2022 / 05:04 PM IST

మ‌హారాష్ట్ర సంకీర్ణ ప్ర‌భుత్వం కూలిపోవ‌డానికి సిద్ధంగా ఉంది. సుమారు 23 మంది శివ‌సేన ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లారు. అక్క‌డ జ‌రుగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్రారంభ‌మైన అల‌జ‌డి కాంగ్రెస్, ఎన్సీపీ, శివ‌సేన, ఇత‌ర చిన్నాచిత‌క పార్టీల‌తో కూడిన‌ సంకీర్ణ ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారింది. ఇటీవ‌ల జ‌రిగిన రాజ్య‌స‌భ ఎన్నిక‌ల సంద‌ర్భంగా పొడ‌చూపిన అంత‌ర్గ‌త విభేదాలు శివ‌సేన ను నిలువునా చీల్చేలా చేసింది. ఆ పార్టీకి చెందిన రెబ‌ల్ మంత్రి ఏక్ నాథ్ షిండే ప‌క్షాన 23 మంది ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్ల‌పోవ‌డంతో సంక్షోభం నెల‌కొంది.

మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో మహా వికాస్ అగాధి కూటమికి 169 ఎమ్మెల్యేల బలం ఉంది. ఇందులో శివవసేన 56, ఎన్సీపీ 53, కాంగ్రెస్ 44, బహుజన్ వికాస్ పార్టీ 3, సమాజ్ వాదీ పార్టీ 2, ప్రహార్ జనశక్తి పార్టీ 2, పీడబ్ల్యూపీకి 1 ఎమ్మెల్యే ఉండగా, 8మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతుగా సంకీర్ణ ప్ర‌భుత్వంలో ఉన్నారు. ఎన్టీయే కూటమి బలం 113గా ఉంది. అందులో బీజేపీకి 106, ఆర్ఎస్పీ 1, జేఎస్ఎస్ 1, ఇండిపెండెంట్లు 5గురు ఉన్నారు. ఈ రెండు కూటములు కాకుండా ఎంఐఎంకు ఇద్దరు, సీపీఐ, ఎంఎన్ఎస్, స్వాభిమాన్ పక్ష్ పార్టీలకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు. శివసేన నుంచి ప్రస్తుతం దూరమైన 23మంది ఎమ్మెల్యేలకు తోడు ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి ఇంకొందరిని బయటికి లాగేసి, ఇండిపెండెంట్ల మద్దతుతో సర్కారు ఏర్పాటు చేయాలని బీజేపీ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.

సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత షిండే వర్గం మంత్రులు, ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. షిండే వెంట 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తొలుత‌ వార్తలు వచ్చిన‌ప్ప‌టికీ ఆ సంఖ్య 23కు పెరిగింద‌ని తెలుస్తోంది. నలుగురు మంత్రులతో పాటు 36 మంది ఎమ్మెల్యేలో షిండే వ‌ద్ద ఉన్నార‌ని కొన్ని న్యూస్ ఛాన‌ల్స్ చెబుతుండ‌డం ఏ క్ష‌ణ‌మైనా మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కూలిపోవ‌డానికి సిద్ధంగా ఉంద‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం మంత్రి ఏక్ నాథ్ షిండేతోపాటు ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలంతా గుజరాత్ లోని సూరత్ న‌గ‌రంలోని ఒక రిసార్టులో ఉన్నట్లు సమాచారం. గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది. సూరత్ లో శివసేన ఎమ్మెల్యేలు బస చేసిన రిసార్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేల జాబితాతో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. బీజేపీ హైకమాండ్, అమిత్ షా, జేపీ నడ్డాలను క‌లుసుకున్న త‌రువాత చ‌క్రం తిప్ప‌నున్నారు.ఇలాగే తొందరపడి సీఎంగా ప్రమాణం చేసి, గంటల వ్యవధిలోనే రాజీనామా చేసిన చేదు అనుభవం దరిమిలా ఫడ్నవిస్ ఈసారి జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. గుజరాత్ క్యాంపులో ఉన్న 23 మంది శివసేన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించడం లేదా విశ్వాస పరీక్షకు దూరంగా ఉంచడం ద్వారా ఉద్ధవ్ సర్కారును కూలగొట్టాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది.

కర్ణాటక, మధ్యప్రదేశ్ తరహాలో బీజేపీ రాజకీయాలు మహారాష్ట్రలో సాగబోనీయమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. మంత్రి ఏక్ నాథ్ షిండేతో టచ్ లోనే ఉన్నామని, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేంతటి సాహసం షిండే చేయబోరని, గుజరాత్ నుంచి ఆయన వర్గం ఎమ్మెల్యేలు తిరిగొస్తారనే నమ్మకం ఉందని రౌత్ మీడియాతో అన్నారు. శివసేనలో తిరుగుబాటు నేపథ్యంలో కూటమిలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం అప్రమత్తం అయ్యాయి. ఆయా పార్టీల కీలక నేతలు ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోవడంతో శివసేన పార్టీ మంగ‌ళ‌వారం ఢిల్లీలో జరిగిన ప్రతిపక్షాల సమావేశానికి వెళ్లలేదు. రౌత్ తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకొని ముంబైలోనే ఉండిపోయారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయమై ఢిల్లీలో ప్రతిపక్షాల సమావేశానికి నేతృత్వం వహిస్తోన్న ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం తిరిగి ముంబై చేరారు. రాత్రికి పవార్ ముంబై చేరగానే నేరుగా సీఎం ఠాక్రేను కలవనున్నారు. శివ‌సేన‌లోని అంత‌ర్గ‌త సంక్షోభంగా ఎన్సీపీ భావిస్తోంది. ఆ మేర‌కు శ‌ర‌ద్ ప‌వార్ మీడియాముఖంగా ప్ర‌క‌టించారు. మొత్తం మీద రాత్రికి రాత్రి మ‌హారాష్ట్ర‌లో స‌మీక‌ర‌ణాలను మార్చేయ‌డానికి శివ‌సేన చీఫ్ , సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేతో భేటీ కానున్నారు. తిరుగుబాటు బావుటా ఎగుర‌వేసిన మంత్రి షిండే తిరిది శివ‌సేన‌లోకి వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌. ఇప్ప‌టికే గుజ‌రాత్ చ‌ట్రంలో ఇరుక్కున ఆయ‌న , అలాగే రెబ‌ల్ ఎమ్మెల్యేలు ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్ట‌డానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లిన ఫ‌డ్న‌విస్ కు అమిత్ షా ఇచ్చే సూచ‌న మేర‌కు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం కూలిపోయే అవ‌కాశం ఉంది.