Thackeray Scoreboard : బాల్‌థాక్రే, ఆయన రాజకీయ వారసుల గురించి చెప్పుకోనిదే మహారాష్ట్ర పాలిటిక్స్ సంపూర్ణం కావు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే, ఉద్ధవ్ థాక్రే సమీప బంధువు వరుణ్ సతీశ్ సర్దేశాయ్, రాజ్ థాక్రే కుమారుడు అమిత్ థాక్రే పోటీ చేశారు. వీరిలో ఆదిత్య థాక్రే ముంబైలోని వర్లీ స్థానం నుంచి గెలిచారు. ఇక వరుణ్ సతీశ్ సర్దేశాయ్ ముంబైలోని వాంద్రే ఈస్ట్ స్థానం నుంచి విజయఢంకా మోగించారు. కానీ రాజ్‌థాక్రే కుమారుడు అమిత్ థాక్రే ముంబైలోని మాహిం స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
Also Read :Jharkhand Elections Result : జార్ఖండ్‌లో జయహో ‘ఇండియా’.. సీఎం సోరెన్ దంపతులు సూపర్ హిట్
- ఆదిత్య థాక్రే, వరుణ్ సతీశ్ సర్దేశాయ్‌లు ఉద్ధవ్ థాక్రేకు చెందిన శివసేన (యూబీటీ) నుంచి పోటీ చేసి గెలిచారు.
- అమిత్ థాక్రే తన తండ్రికి చెందిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) తరఫున పోటీ చేసి ఓడారు. మాహిం స్థానంలో అమిత్‌పై ఉద్ధవ్ శివసేన అభ్యర్థి మహేశ్ సావంత్ గెలిచారు.
- వర్లీ స్థానంలో ఆదిత్య థాక్రేతో ఏక్‌నాథ్ షిండేే వర్గం శివసేన తరఫున మాజీ కాంగ్రెస్ నేత మిలింద్ దేవర పోటీపడ్డారు. అయితే విజయం మాత్రం ఆదిత్యను వరించింది. ఇదే స్థానంలో ఎంఎన్ఎస్ తరఫున సందీప్ దేశ్ పాండే పోటీ చేసి ఓట్లను చీల్చారు. ఓట్ల చీలిక ప్రధానంగా షిండే శివసేన, ఎంఎన్ఎస్ పార్టీల మధ్య జరిగింది. ఇది అడ్వాంటేజీగా మారి విజయం ఆదిత్య థాక్రేను వరించింది.
- ఆదిత్య థాక్రే తొలిసారిగా 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. ఎన్నికల్లో ఈసారి గెలిచి ఆయన రెండోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు.
Also Read :Governor Statue : రాజ్‌భవన్‌లో గవర్నర్ విగ్రహం.. స్వయంగా ఆవిష్కరించిన ఆనంద్ బోస్
- ఉద్ధవ్ థాక్రే సమీప బంధువు వరుణ్ సర్దేశాయ్ విజయఢంకా మోగించారు. అజిత్ పవార్ వర్గం ఎన్‌సీపీ తరఫున పోటీ చేసిన జీషాన్ సిద్దిఖీపై ఆయన గెలిచారు. జీషాన్ సిద్దిఖీ తండ్రి బాబా సిద్దిఖీ నెల రోజుల క్రితమే ముంబైలో దారుణ హత్యకు గురయ్యారు. ఆ సానుభూతి పవనాలతో గెలుస్తానని జీషాన్ భావించారు. కానీ అలా జరగలేదు. రాజకీయంగా బలంగా ఉన్న వరుణ్ సర్దేశాయ్‌నే విజయం వరించింది. తన తండ్రి హత్యకు న్యాయం కోరుతూ జీషాన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే అధికార ఎన్‌సీపీ(అజిత్ పవార్)లో ఉంటూ ఆయన ఇలాంటి ప్రచారం చేయడాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోలేకపోయారు. దాని ప్రభావం ఎన్నికల ఫలితాల్లో కనిపించింది.
- మాహిం అసెంబ్లీ స్థానం పరిధిలోనే ఉద్ధవ్ శివసేన(Thackeray Scoreboard) పార్టీ ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడి నుంచి మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధినేత రాజ్ థాక్రే కుమారుడు అమిత్ థాక్రే పోటీ చేసి ఓడిపోయారు. ఉద్ధవ్ శివసేనకు చెందిన మహేశ్ సావంత్‌ను విజయం వరించింది. బహుశా మరేదైనా స్థానం నుంచి పోటీ చేసి ఉంటే అమిత్ థాక్రే విజయావకాశాలు పెరిగి ఉండేవని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.