Gujarat hooch tragedy: గుజరాత్ గడ్డపై కల్తీ మద్యం కాటు.. 37 మంది మృతి

గాంధీ పుట్టిన రాష్ట్రం గుజరాత్ లో మద్యం ఏరులై పారుతోంది. మద్య నిషేధం నామ్ కే వాస్తే అన్నట్టుగా అమలవుతోంది. ప్రమాదకర రసాయనాలు కలిపిన మద్యం తాగి బోటాడ్ జిల్లాలో దాదాపు 37 మంది మృతిచెందారు.

  • Written By:
  • Publish Date - July 27, 2022 / 12:27 PM IST

గాంధీ పుట్టిన రాష్ట్రం గుజరాత్ లో మద్యం ఏరులై పారుతోంది. మద్య నిషేధం నామ్ కే వాస్తే అన్నట్టుగా అమలవుతోంది. ప్రమాదకర రసాయనాలు కలిపిన మద్యం తాగి బోటాడ్ జిల్లాలో దాదాపు 37 మంది మృతిచెందారు. ఈ జిల్లాలోని రోజిద్ గ్రామంలోని పలువురు, ధందుక, భావ్​నగర్ ప్రాంతాల్లోని ఇంకొందరు కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురయ్యారు. సోమవారం నుంచి మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. బుధవారం ఉదయానికి కల్తీ మద్యం కాటుకు బలైనవారి సంఖ్య 37కి పెరిగింది. మరో 50 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుదున్నారు.ఈ ఘటనపై విచారణ కోసం గుజరాత్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.

బోటాడ్ జిల్లాలో..

బోటాడ్ జిల్లాలో కల్తీ మద్యం మరణాలపై గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ , అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ రంగంలోకి దిగి విచారణ ప్రారంభించాయి. కల్తీ మద్యం తయారుచేస్తున్న జిల్లాకు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కల్తీ మద్యం తాగి చనిపోయిన వారిలో ఎక్కువ మంది పేదలు, రోజు కూలీలే కావడం గమనార్హం. రూ.25, రూ.40 ధరకు కల్తీ మద్యం పొట్లాలు విక్రయించినట్లు ప్రాథమిక విచారణ లో తేలింది. వీటిని తాగిన వారే చనిపోయినట్లు వెల్లడైంది.

ఆ మద్యంలో ఏముంది ?

బాధితులు తాగిన విషపూరిత మద్యంలో ఉండే మిథైల్‌ను ఎమోస్‌ అనే కంపెనీ సరఫరా చేసినట్లు తెలుస్తోంది. గోడౌన్ మేనేజర్ జయేష్ అకా రాజు తన బంధువు సంజయ్‌కు రూ.60 వేలకు 200 లీటర్ల మిథైల్‌ను సరఫరా చేశాడని సమాచారం. అది తాగిన వారంతా అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారని గుర్తించారు. మొత్తం 600 లీటర్ల మిథైల్‌ను ఎమోస్ కంపెనీ సరఫరా చేసిందని, అందులో 450 లీటర్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. నిందితులపై హత్యానేరం మోపనున్నట్లు వారు తెలిపారు.

మద్యపాన నిషేధంపై ప్రశ్నలు

ఈ ఘటన తర్వాత గుజరాత్‌లో మద్యపాన నిషేధంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లో విషపూరిత మద్యం దుర్ఘటనను దురదృష్టకరమని అభివర్ణించారు. మద్యపాన నిషేధం ఉన్న రాష్ట్రంలో.. కల్తీ మద్యం అమ్ముతున్న వారికి రాజకీయ అండ ఉందంటూ ఆరోపించారు. కల్తీ మద్యం విక్రయించిన సొమ్ము ఎక్కడికి పోతుందో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.