Site icon HashtagU Telugu

Jammu Election : కశ్మీర్ ఎన్నికల్లో కాషాయ పార్టీ వ్యూహం ఏమిటో తెలుసా ?

Jammu election Bjp Mission Kashmir

Jammu Election : జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అక్కడున్న ఏడు స్థానిక పార్టీలతో పాటు కాంగ్రెస్‌ను ఎదుర్కొనే విషయంలో కాషాయ పార్టీ చాకచక్యంగా వ్యవహరిస్తోంది. కశ్మీర్‌లోని మొత్తం 90 అసెంబ్లీ సీట్లకుగానూ దాదాపు 32 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో గెలిచే వారంతా.. కశ్మీర్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారనున్నారు. అందుకే ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ ముందస్తు ప్రణాళికతో రెడీగా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మరోవైపు జమ్మూకశ్మీరులోని జమ్మూ ప్రాంతంలో ఆధిక్యాన్ని సాధించే ప్రయత్నాల్లో బీజేపీ ఉందని వారు అంటున్నారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతు, జమ్మూ ప్రాంతంలో పెద్దసంఖ్యలో వచ్చే అసెంబ్లీ  సీట్ల బలంతో విజయానికి చేరువ అవుతామని కాషాయ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల తర్వాత ఏవైనా రెండు కశ్మీరీ స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. అయితే తమతో చేతులు కలపబోయే  ఆ పార్టీలు ఏవి అనే విషయాన్ని కమలదళం(Jammu Election) వెల్లడించడం లేదు.

Also Read :PM Modis Portrait : 800 కేజీల మిల్లెట్లతో ప్రధాని మోడీ చిత్రం.. స్కూలు విద్యార్థిని క్రియేటివ్ విషెస్

గతంలో కశ్మీరులో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చరిత్ర పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ)కి ఉంది. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అప్పట్లో బీజేపీకి మద్దతు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల టైంలో బీజేపీకి మద్దతు ప్రకటిస్తే పీడీపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కశ్మీరులో బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. అందుకే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కశ్మీర్ డెవలప్‌‌మెంట్ అనే పేరుతో బీజేపీతో చేతులు కలిపేందుకు ఏదైనా రాజకీయ పార్టీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్రనేత ఉమర్ అబ్దుల్లా కూడా ఇలాంటి వ్యాఖ్యలనే ఇటీవలే చేశారు. పీడీపీని బీజేపీకి బీ టీమ్‌గా ఆయన అభివర్ణించారు. పీడీపీ సైతం ఎన్నికల ప్రచారంలో ఎక్కడా బీజేపీని వ్యతిరేకించడం లేదు. బీజేపీ సైతం కేవలం కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిని విమర్శిస్తోంది. దీంతో కశ్మీర్‌లో మళ్లీ  బీజేపీ, పీడీపీ కూటమి ఏర్పాటయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read :Johnny Master : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు..