Jnanpith Award : 59వ జ్ఞానపీఠ్ పురస్కారానికి 88 ఏళ్ల వినోద్ కుమార్ శుక్లా ఎంపికయ్యారు. ఈయన ప్రముఖ హిందీ రచయిత. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి ఈ అత్యున్నత సాహిత్య పురస్కారానికి ఎంపికైన తొలి రచయిత శుక్లానే. ఈ పురస్కారం కింద రూ.11 లక్షల నగదు, సరస్వతి కాంస్య విగ్రహాన్ని అందిస్తారు. హిందీ సాహిత్యం, విలక్షణమైన రచనా శైలికి చేసిన కృషికిగానూ ఈ అవార్డుకు వినోద్ కుమార్ శుక్లాను ఎంపిక చేశారు. జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికైన 12వ హిందీ రచయిత ఈయనే. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ప్రతిభా రే అధ్యక్షతన ఏర్పాటైన జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ ఈసారి ఈ పురస్కారాన్ని వినోద్ కుమార్ శుక్లాకు ఇవ్వాలని నిర్ణయించింది. హిందీ సాహిత్యానికి ఆయన అందించిన సేవలను ఈ కమిటీ కొనియాడింది. హిందీలో వినోద్ రచనా శైలి అమోఘం అని కితాబిచ్చింది. జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీలో సాహితీవేత్తలు మాధవ్ కౌశిక్, దామోదర్ మౌజో, ప్రభావర్మ, అనామికా, ఎ.క్రిష్ణారావు, ప్రఫుల్ శీలేదర్, జానకి ప్రసాద్ శర్మ, మధుసూదన్ ఆనంద్ సభ్యులుగా ఉన్నారు. 2024 సంవత్సరంలో ఉర్దూ కవి, సినీ గేయరచయిత గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
Also Read :PVR Inox : బిగ్ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో బిగ్ డీల్
1999లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
- వినోద్ కుమార్ శుక్లా రచించిన ‘దీవార్ మే ఏక్ ఖిర్కీ రహతీ థీ’ నవలకు 1999లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
- 1979లో ‘నౌకర్ కీ కమీజ్’ అనే టైటిల్‌తో మరో రచనను వినోద్ కుమార్ విడుదల చేశారు. ఈ నవల ఆధారంగా డైరెక్టర్ మణి కౌల్ సినిమా తీశారు.
- 1992లో ‘సబ్ కుచ్ హోనా బచా రహేగా’ అనే టైటిల్‌తో కవితా సంకలనాన్ని వినోద్ కుమార్ విడుదల చేశారు.
- 1961లో జ్ఞానపీఠ్(Jnanpith Award) పురస్కారం ఏర్పాటైంది.
- మొదటి జ్ఞానపీఠ్ పురస్కారాన్ని మలయాళం కవి జి.శంకర కురూప్ 1965లో అందుకున్నారు.