Site icon HashtagU Telugu

Melting Himalayas: కరుగుతున్న హిమాలయాలు.. వణుకుతున్న పాక్.. ఎందుకు, ఏమిటి ?

Floodwaters In Jaffarabad Imresizer

Floodwaters In Jaffarabad Imresizer

వాతావరణ కాలుష్యం ప్రభావం హిమాలయాలపైనా పడింది. ఫలితంగా హిమాలయాల్లో మంచు ఫలకాలు రికార్డు స్థాయిలో కరిగిపోతున్నాయి. దీని ప్రతికూల ప్రభావాన్ని భవిష్యత్ లో హిమాలయాలను ఆనుకొని ఉన్న అన్ని దేశాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ప్రతికూల ప్రభావం పాకిస్థాన్ లో వరదల రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. పాక్ లో ఇప్పుడు సంభవిస్తున్న అసాధారణ వరదలకు వాతావరణ మార్పులతో పాటు హిమాలయాలు కరగడం ముఖ్య కారణమని గుర్తించారు.

15 ఏళ్లుగా..

15 ఏళ్లుగా హిమాలయాల్లో మంచుపై పరిశోధనలు చేస్తున్న ఇండోర్‌ ఐఐటీ బృందం అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది వేసవిలో తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో హిమఫలకాలు భారీగా కరిగాయని చెబుతోందీ పరిశోధకులు బృందం.
హిమాచల్‌ ప్రదేశ్‌లో హిమాలయాలపై, ఛోటా షిగ్రీ గ్లేసియర్‌పై అధ్యయనంలో భాగంగా.. గత 15 ఏళ్ల పరిస్థితులను ఆధారంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేశారు ఇండోర్‌ ఐఐటీ సైంటిస్టులు. ఈ మార్పులు ఎంతగా ఉన్నాయంటే.. హిమానీనదం కరిగిన ప్రభావంతో.. పరిశోధనా కేంద్రం కూడా వరదల్లో కొట్టుకుపోయింది. ఈ పరిశోధనా కేంద్రాన్ని జూన్‌లో ఏర్పాటు చేస్తే.. ఆగస్టులో వరదలకు నామ రూపాలు లేకుండా పోయింది. 2021లో ఐఐటీ ఇండోర్‌ బృందం కొన్ని ప్రమాద సంకేతాలను గుర్తించింది. ఈ శతాబ్దం మొత్తం ఇక్కడ ఇదే విధంగా హిమాలయాల్లో మంచు కరిగితే భవిష్యత్తులో నీటి కరవు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది.వేడెక్కుతున్న అరేబియా సముద్రం, లా నినా ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

లక్షలాదిమంది నష్టపోయారు..

పాక్ ని వరదలు ముంచెత్తడంతో లక్షలాదిమంది నష్టపోయారు. లక్షల హెక్టార్లలో పొలాలు నీటమునిగాయి. 20 డ్యామ్‌లపై నుంచి నీరు పొంగిపొర్లుతోంది.
హిమాలయ హిమానీనదం కరిగిపోయే ప్రభావం.. పాక్‌ భూభాగంలో ఉన్న 7,000 హిమానీనదాలపై ప్రభావాన్ని చూపెట్టనుందని అంటున్నారు.
ఆ వెంటనే మరొకటి వరదల రూపంలో మహా ప్రళయం ముంచెత్తి.. పాక్‌ను ఎంత డ్యామేజ్‌ చేస్తుందో తెలియదు. కానీ..ఆ తర్వాత తీవ్రమైన కరువు కచ్చితంగా పాక్‌ను మరింతగా దిగజారస్తుంది అని హెచ్చరిస్తున్నారు. రాబోయే విపత్తులను తల్చుకుని పాక్‌ ప్రజలు వణికిపోతున్నారు. టిబెట్‌ నుంచి మొదలయ్యే సింధు నదీ పరీవాహక ప్రాంతం.. పాక్‌ గుండా ప్రవహించి కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది ఫ్రాన్స్‌ కంటే రెండింతల పరిమాణంలో ఉండి.. పాక్‌కు 90 శాతం ఆహారో త్పత్తులను అందిస్తోంది. కాగా పాకిస్థాన్ వరదల ప్రభావానికి 1000మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు. తినటానికి తిండి..తాగటానికి నీరు లేక పాకిస్థాన్ ప్రజలు అల్లాడి పోతున్నారు.