Owners Names : ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం బాటలోనే హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్నిహోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాలు అమ్మే ప్రదేశాల్లో నిర్వాహకులు, యజమానులు, మేనేజర్ల పేర్లను తప్పకుండా డిస్‌ప్లే చేయాలని హిమాచల్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల పారదర్శకత, ప్రజారోగ్య భద్రతకు ఆస్కారం ఉంటుందని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.
Also Read :AI Spam Detection : స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు చెక్.. ఎయిర్‌టెల్ యూజర్లకు ఫ్రీగా ఏఐ ఫీచర్
మంగళవారం రోజే (సెప్టెంబరు 24న) ఉత్తరప్రదేశ్‌లోని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇదే తరహా(Owners Names) నిబంధనలతో కూడిన ఆదేశాలను జారీ చేసింది. కేవలం 24 గంటల వ్యవధిలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే తరహా నిబంధనలతో ఉత్తర్వును విడుదల చేయడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని పలుచోట్ల హోటళ్లు, రెస్టారెంట్లలో విక్రయించే జ్యూస్‌లు, చపాతీలలో దారుణమైన పదార్థాలను కలుపుతున్నారని ఇటీవలే బయటపడింది. అందుకే ఆయా దుకాణాల నిర్వాహకుల పేర్లను ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేయాలని యూపీ సర్కారు నిర్ణయించింది. హిమాచల్ ప్రదేశ్ సర్కారు తీసుకున్న నిర్ణయం వివరాలను మంత్రి విక్రమాదిత్య సింగ్ వెల్లడించారు. మున్సిపల్ కార్పొరేషన్ శాఖ, పబ్లిక్ వర్క్స్ అర్బన్ డెవలప్మెంట్ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశం అనంతరం ఈ వివరాలతో ఆయన ఫేస్‌బుక్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.
Also Read :CM Siddaramaiah : ‘ముడా’ స్కాం.. సీఎం సిద్ధరామయ్యపై లోకాయుక్త విచారణకు కోర్టు ఆదేశం
‘‘హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రతి రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ షాపు ఇక తప్పనిసరిగా యజమాని ఐడీ కార్డును ప్రదర్శించాలి. దీనివల్ల వినియోగదారులకు అసౌకర్యం తొలగిపోతుంది. రాష్ట్రంలో ఆహార ఉత్పత్తులు విక్రయించుకునే హాకర్లకు ఐడీ కార్డులను జారీ చేసేందుకు ఉద్దేశించిన చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతాం’’ అని విక్రమాదిత్య సింగ్ చెప్పారు. ఈ ఆదేేశాలను అమలు చేసే బాధ్యతను రాష్ట్ర మంత్రులు విక్రమాదిత్య సింగ్, అనిరుధ్ సింగ్‌లకు హిమాచల్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అప్పగించారు. కాగా, వైఎస్సార్ సీపీ హయాంలో ఏపీలోని తిరుపతికి వచ్చిన భక్తులకు అందించిన లడ్డూలలో జంతువుల కొవ్వు, చేప నూనె ఉన్నాయని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఈనేపథ్యంలోనే ప్రజల మతపరమైన మనోభావాలను కాపాడేందుకు అన్ని రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి.