Himachal Pradesh : హిమాచల్‌ప్రదేశ్‌ను గత కొంతకాలంగా కుంభవృష్టి వేధిస్తోంది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు రాష్ట్రంలో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇప్పటివరకు 63 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేకమంది గల్లంతయ్యారు. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం ఈ నెల 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రాంతంలోని నదులు ఉప్పొంగిపోతుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదల ధాటికి వందలాది ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రభుత్వ నివేదికల ప్రకారం దాదాపు రూ.400 కోట్ల మేర ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని విపత్తు నిర్వహణశాఖ అధికారులు చెబుతున్నారు.
Read Also: Purandeswari : బీజేపీకి మహిళా సారథి.. రేసులో పురంధేశ్వరి..?
మృతుల సంఖ్య జిల్లాల వారీగా పరిశీలిస్తే, మండీ జిల్లాలోనే 17 మంది, కాంగ్రా జిల్లాలో 13 మంది, చంబా జిల్లాలో 6 మంది, సిమ్లా జిల్లాలో 5 మంది మృతి చెందారు. మండీ జిల్లాలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని అధికారులు వెల్లడించారు. తునాగ్, బాగ్సాయెద్ ప్రాంతాల్లో విపరీతంగా వర్షాలు కురుస్తుండటంతో అక్కడే ఎక్కువ మంది గల్లంతయ్యారు. ఈ జిల్లాలోనే 40 మంది వరకు ఆచూకీ తెలియని పరిస్థితి నెలకొంది. ఈ వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 100 మందికి పైగా గాయపడ్డారు. పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మొత్తం 14 వంతెనలు కూలిపోయాయని అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వేలాది ప్రజలు చీకట్లో ఉండాల్సి వస్తోంది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వం, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. భారత ఆర్మీ, NDRF, SDRF బృందాలు సహాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నాయి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయగా, బాధితులకు తాత్కాలిక ఆశ్రయం, ఆహారం, నీరు అందిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అధికారులు లేదా నేరుగా హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. వర్ష బీభత్సం ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు. హిమాచల్‌లో నెలకొన్న ఈ భారీ వర్షాలు, వరదల పరిస్థితి గణనీయంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. సహాయ నిధుల విడుదల, పునరుద్ధరణ చర్యల కోసం చర్చలు జరుపుతోంది. ఇలాంటి విపత్తుల్లో ప్రజలు సహనం పాటిస్తూ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.
Read Also: Kavitha : భవిష్యత్‌లో సీఎం అవుతా..బీఆర్ఎస్ నాదే.. కొత్త పార్టీ పెట్టను : ఎమ్మెల్సీ కవిత