Himachal Pradesh : నేడు హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం.. సీఎం అభ్య‌ర్థిపై క్లారిటీ..?

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

  • Written By:
  • Updated On - December 9, 2022 / 09:51 AM IST

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం సిమ్లాలో సమావేశం కానున్నారు. హిమాచల్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం రాజీవ్ భవన్‌లో జరగనుంది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రాజీవ్ శుక్లా, సూపర్‌వైజర్లు భూపేష్ బఘేల్, భూపేంద్ర హుడా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.

ఎమ్మెల్యేలు ఒక తీర్మానాన్ని ఆమోదించి, ముఖ్యమంత్రి అభ్య‌ర్థిని ఎన్నుకోనున్నారు. సీఎం రేసులో చాలామంది ఆశావహులు ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ మాజీ చీఫ్‌ సుఖ్‌విందర్‌ సింగ్‌ సుఖూ, సీఎల్‌పీ నేత ముఖేష్‌ అగ్నిహోత్రి కూడా ఈ పదవికి పోటీ పడుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ చీఫ్ నిర్ణయిస్తారని ఇంఛార్జ్ రాజీవ్ శుక్లా అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పదవిపై పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఐదేళ్ల తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌లో గురువారం నాడు ప్రకటించిన ఫలితాల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. 68 మంది సభ్యులున్న అసెంబ్లీలో అధికార వ్యతిరేకతతో కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 25 సీట్లు గెలుచుకుంది. ఇండిపెండెంట్లు మూడు స్థానాల్లో విజయం సాధించగా, ఆప్ రాష్ట్రంలో తన ఖాతా తెరవలేకపోయింది.