Site icon HashtagU Telugu

CM Siddaramaiah : కర్ణాటక సీఎంకు హైకోర్టు నోటీసులు

Karnataka

Karnataka

MUDA Case : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్య, ఇతరులపై ముడా భూముల కేటాయింపు కేసును సీబీఐ (CBI)కి బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై కర్ణాటక హైకోర్టు సిద్ధరామయ్యకు మంగళవారంనాడు నోటీసులు పంపింది. స్నేహమయి కృష్ణ వేసిన ఈ పిటిషన్‌పై కేంద్రం ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, లోకాయుక్త పోలీసులకు హైకోర్టు నోటీసులు పంపింది. లోకాయుక్త పోలీసులు ఇంతవరకూ చేసిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను నవంబర్ 25వ తేదీలోగా తమకు సమర్పించాలని కూడా కోర్టు కోరింది. తదుపరి విచారణను నవంబర్ 26న తేదీకి వాయిదా వేసింది. ముడా భూముల కేటాయింపుల వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సెప్టెంబర్ 27న కోర్టు ఇచ్చిన ఆదేశాలతో మైసూరు లోకాయుక్త పోలీసులు అధికారికంగా కేసుపై దర్యాప్తు జరుపుతున్నారు.

సిద్ధరామయ్య భార్యకు రూ.56 కోట్లు విలువచేసే 14 స్థలాలను ముడా కేటాయించడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై లోకాయుక్త విచారణ జరుపుతోంది. మైసూరు సిటీలోని ఖరీదైన ప్రాంతంలో అక్రమంగా సిద్ధరామయ్య భార్యకు 14 స్థలాలను ముడా కేటాయించినట్టు ఆరోపణలుున్నాయి. కేసు విచారణలో భాగంగా ఇటీవల సిద్ధరామయ్య భార్య పార్వతిని ముడా పోలీసులు ప్రశ్నించారు. ఈనెల 6వ తేదీన తమ ముందు హాజరుకావాలని సిద్ధరామయ్యకు సైతం మైసూరు లోకాయుక్త సోమవారంనాడు నోటీసులు పంపింది. నోటీసులు తనకు అందాయని, 6వ తేదీన విచారణకు హాజరవుతానని సిద్ధరామయ్య ధ్రువీకరించారు.

కాగా, ముడాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌పోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సైతం అక్టోబర్ 28న మంగళూరు, బెంగళూరు, మాండ్య, మైసూరు సహా కర్ణాటకలోని ఆరు చోట్ల గాలింపు చర్యలు చేపట్టింది. ముడాతో అసోసియేషన్ ఉన్న ఆరుగురు ఉద్యోగులకు సమన్లు పంపింది. సిద్ధరామయ్య, ఆయన భార్యతో సహా పలువురిపై మనీ లాండిరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది.

Read Also: Lady Aghori Naga Sadhu : పవన్ కల్యాణ్‌కు ఆశీస్సులు తెలిపిన లేడీ అఘోర..