ఛత్తీస్‌గఢ్-తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా (Hidma) మృతి చెందాడన్న వార్తలపై మావోయిస్టు కమిటీ లేఖ విడుదల చేసింది. ఆయన చనిపోలేదని స్పష్టం చేశారు. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పేరుతో లేఖను విడుదల చేశారు.
మావోయిస్టు అగ్రనేత మద్వి హిడ్మా మృతి చెందారన్న వార్తల్లో నిజం లేదు. హిడ్మా సేఫ్‌గానే ఉన్నట్టు చెప్పారు. దక్షిణ బస్తర్‌లోని జంగిల్ కొండలపై పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు.. డ్రోన్‌లు, హెలికాప్టర్‌లతో దాడి చేశారు. వైమానిక దాడులు జరిగాయి. గతేడాది ఏప్రిల్‌లో కూడా వైమానిక బాంబు దాడి జరిగింది. మావోయిస్టు పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు వందల సంఖ్యలో బాంబులు పేల్చారు. రాత్రి, పగలు తేడా లేకుండా హెలికాప్టర్ల ద్వారా నిఘా పెట్టారు.
Also Read: Ayyappa Swamy Prasadam: కేరళ అయ్యప్ప స్వామి ప్రసాదం నిలిపివేత!
వచ్చే ఎన్నికలలోపు మావోయిస్టులను లేకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. అందులో భాగమే మావోయిస్టులపై ఈ దాడులు. ఈ భీకర దాడుల కారణంగా ప్రజలు పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రపంచంలోని ప్రగతిశీల కూటమిలన్నీ ఏకం కావాలని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ-బీజాపూర్ సరిహద్దులో గ్రేహౌండ్స్, సీఆర్‌ఎఫ్‌ఎఫ్ కోబ్రా ఆధ్వర్యంలో జాయింట్ ఆపరేషన్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశాతో సహా పలు రాష్ట్రాల్లో మావోయిస్టుల కీలక వ్యూహకర్త హిడ్మా మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. అతనితో పాటు పలువురు నక్సలైట్లు హతమైనట్లు కూడా వార్తలు వచ్చాయి. హిడ్మా చనిపోలేదని మావోయిస్టు లేఖలో స్పష్టమైంది.
హిడ్మాపై రూ.45 లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. 2010లో తాడ్ మేళాలో మెరుపు దాడి చేసి 24 మంది జవాన్లను చంపడం, 2013లో కాంగ్రెస్ నేతల ఊచకోత, 2017లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి హతమార్చిన కేసులో హిడ్మానే ప్రధాన వ్యూహకర్త అని తెలుస్తోంది. 2021 ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లాలో హిడ్మా స్ట్రాటజీలో 22 మంది బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.