Site icon HashtagU Telugu

Helicopter Crash : కొండల్లో కూలిన హెలికాప్టర్.. ముగ్గురి మృతి

Helicopter Crash Pune Maharashtra

Helicopter Crash : ఇవాళ తెల్లవారుజామున టేకాఫ్‌ అయిన ఓ హెలికాప్టర్‌ కుప్పకూలింది. మహారాష్ట్రలోని పూణే సమీపంలో ఉన్న బవ్దాన్‌ ఏరియా కొండ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌‌లోని ముగ్గురు చనిపోయారు. చనిపోయిన వారిలో ఇద్దరు పైలట్లు  పరమజిత్ సింగ్, జీకే పిళ్లై, ఇంజినీర్‌ ప్రీతమ్ భరద్వాజ్ ఉన్నారు. దట్టమైన పొగమంచు వల్లే కొండ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిందని భావిస్తున్నారు. ఈ హెలికాప్టర్ ఢిల్లీ కేంద్రంగా నడిచే ప్రైవేటు విమానయాన సంస్థ హెరిటేజ్ ఏవియేషన్‌కు చెందినదని పోలీసులు గుర్తించారు. పూణేలోని ఆక్స్‌ఫర్డ్‌ గోల్ఫ్‌క్లబ్‌ హెలీప్యాడ్‌ నుంచి ముంబైలోని జుహు ప్రాంతానికి ఈ హెలికాప్టర్ వెళ్తుండగా ప్రమాదం జరిగగిందని తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే తాము ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు(Helicopter Crash) చేపట్టామన్నారు. కూలిన వెంటనే హెలికాప్టర్‌ పూర్తిగా దగ్ధమైందని పోలీసులు చెప్పారు. చనిపోయిన ముగ్గురి డెడ్‌బాడీస్‌కు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి కుటుంబాలకు అప్పగిస్తామన్నారు.

Also Read :Iran Vs Israel : ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఎటాక్.. భారతీయులకు భారత ఎంబసీ అడ్వైజరీ

‘‘మేం సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నాం. అప్పటికే హెలికాప్టర్ కూలిపోయి దాని భాగాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. మేం వెంటనే మంటలను ఆర్పాం. అయితే అప్పటికే హెలికాప్టర్‌లోని ముగ్గురు చనిపోయారు. అనంతరం పోలీసులను అక్కడికి పిలిచాం. వారు దర్యాప్తు మొదలుపెట్టారు’’ అని బవ్దాన్‌ ఏరియా చీఫ్ ఫైర్ ఆఫీసర్, దేవేంద్ర ప్రభాకర్ తెలిపారు. హెలికాప్టర్‌కు వీటీ ఈవీవీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉందని  పోలీసులు తెలిపారు.

Also Read :Jimmy Carter 100 : అలనాటి అమెరికా అధ్యక్షుడి వందేళ్ల బర్త్‌ డే.. జిమ్మీ కార్టర్ సెంచరీ

ఈ ఏడాది ఆగస్టులో ముంబై నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ప్రైవేటు హెలికాప్టర్ పూణే జిల్లా పౌడ్ గ్రామంలో కూలిపోయింది. అయితే అందులోని నలుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ హెలికాప్టర్ ఒక ప్రైవేటు విమానయాన కంపెనీకి చెందినదని గుర్తించారు. మొత్తం మీద వరుస హెలికాప్టర్ ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి.  ఈ ఏడాది ప్రారంభంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్,  దేవేంద్ర ఫడ్నవిస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుదుపులకు గురైంది. అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి దాన్ని వెంటనే సురక్షిత ప్రదేశంలో ల్యాండ్ చేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.