ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వివిధ ప్రాంతాల్లో 10 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాంపూర్‌లో ఇద్దరు నీటిలో కొట్టుకుపోయి చనిపోగా.. బల్లియా, మహోబా, లలిత్‌పూర్ జిల్లాల్లో పిడుగుపాటు కారణంగా ఏడుగురు మరణించారు. సుల్తాన్‌పూర్‌లో పాముకాటుతో ఒకరు మరణించారని అధికారులు తెలిపారు. నీటిపారుదల శాఖ తెలిపిన వివరాల ప్రకారం .. బుదౌన్‌లో గంగా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. బులంద్‌షహర్, ఫరూఖాబాద్‌లలో నది ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పరయాగ్‌రాజ్‌లో యమునా నది కూడా ప్రమాద స్థాయికి చేరువలో ప్రవహిస్తోంది. మథురలో, యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటిన తర్వాత పెరుగుతూనే ఉందని అధికారులు తెలిపారు. జిల్లాలోని మంత్ ప్రాంతంలోని పలు గ్రామాలు జలమయమైయ్యాయి. వందల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. మధుర, బృందావన్‌లోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు, రోడ్లు జలమయమయ్యాయని అధికారులు తెలిపారు. ప్రజలను రక్షించేందుకు, ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. రానున్న 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
10 Killed : యూపీలో భారీవర్షాలకు 10 మంది మృతి.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు

Heavy Rains