Site icon HashtagU Telugu

Heavy rains : ఢిల్లీలో కుండపోత వర్షాలు..గోడ కూలి ఎనిమిది మంది మృతి

Heavy rains in Delhi, eight killed in wall collapse

Heavy rains in Delhi, eight killed in wall collapse

Heavy rains : దేశ రాజధాని ఢిల్లీలో కురుస్తున్న కుండపోత వర్షాలు తీవ్ర విషాదానికి దారితీశాయి. శనివారం ఉదయం ఆగ్నేయ ఢిల్లీలోని జైత్‌పూర్ ప్రాంతంలో జరిగిన గోడ కూలిన ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా విషాదచాయలు నింపింది.

హరి నగర్ మురికివాడలో విషాదం

పోలీసుల కథనం ప్రకారం, ఈ ప్రమాదం హరి నగర్ మురికివాడలో చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి ఓ ఆలయం సమీపంలోని పాత గోడ నీటిని తట్టుకోలేక శనివారం ఉదయం అకస్మాత్తుగా కూలిపోయింది. అప్పటి సమయంలో గోడ సమీపంలోని నివాసాల్లో కుటుంబాలు నిద్రలో ఉండడంతో ఆస్తి, ప్రాణనష్టం చోటుచేసుకుంది.

మృతుల వివరాలు

ఈ ప్రమాదంలో మృతిచెందినవారిని ముట్టు అలీ (45), రబీబుల్ (30), షబీబుల్ (30), రుబీనా (25), డాలీ (25), హషిబుల్, చిన్నారులు రుఖ్సానా (6), హసీనా (7)లుగా గుర్తించారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులుండడం స్థానికులను మరింత కలచివేస్తోంది.

స్థానికుల సహాయం – అధికారుల స్పందన

దుర్ఘటన జరిగిన వెంటనే స్థానికులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేసినా, చాలా మందిని అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగించారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతం మొత్తాన్ని ఖాళీ చేయించామని అధికారులు తెలిపారు.

వర్షాల ధాటికి ఢిల్లీ స్తంభించింది

ఇక వర్షాల ప్రభావంతో ఢిల్లీ నగరం అస్తవ్యస్తమైపోయింది. రాఖీ పండుగ రద్దీకి తోడు భారీ వర్షాలు కారణంగా రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా మధుర రోడ్, కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్ వంటి ప్రాంతాల్లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. నదులు, డ్రైనేజీలు పొంగిపొర్లడంతో పలు కాలనీలు నీటిలో మునిగిపోయాయి.

విమానాల రాకపోకలపై దెబ్బ

ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి 130కి పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు ఫ్లైట్‌రాడార్ డేటా వెల్లడించింది. వర్షాల కారణంగా విమానాశ్రయంలో ట్రాఫిక్ కుదిపేసింది. ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా వంటి సంస్థలు ప్రయాణికులకు ముందుగా ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించాయి.

వాతావరణ శాఖ హెచ్చరికలు

భారత వాతావరణ శాఖ (IMD) ఢిల్లీ ప్రజలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అవసరం లేకపోతే బయటకు రాకుండా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించింది.

Read Also: SSMB29 : ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.. ఆ హీరోలాగే ఉందంటూ కామెంట్స్