Site icon HashtagU Telugu

Red Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్!

Heavy Rains

Heavy Rains

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదులు పొంగి పొర్లుతున్నాయి. కేరళ, కోస్టల్ కర్నాటక, గుజరాత్, మహారాష్ట్ర, గోవాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఆయా ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాగల మూడు, నాలుగు రోజుల్లో ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే వచ్చే ఐదు రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణలో..

ఇవాళ తెలంగాణలోని మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు. రేపు (జూలై 26న) జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని(Rain Alert Today)  హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో

పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరో 24 గంటల్లో…… ఉత్తర కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. క్రమంగా అది మరింత బలపడి రేపటికి వాయుగుండంగా మారే అవకాశమున్నట్లు ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 3-4 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఒకటి, రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ఏలూరు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Also Read: Auto Ride: బెంగళూరులో బాదుడే బాదుడు.. 500 మీట‌ర్లకే రూ.100 వసూలు చేసిన ఆటో డ్రైవర్