Weather Updates : గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తుండగా, తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాల తీవ్రత పెరుగుతోంది. నిన్నటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారుతున్నాయి.
ఉత్తర బంగాళాఖాతంతో పాటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముంది.
తెలంగాణలో 19 జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ వర్షాలకు ఉరుములు, మెరుపులు తోడవుతాయని తెలిపింది. అలాగే, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశమున్నట్లు కూడా సూచించింది.
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఇక తీర ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీసే అవకాశం ఉన్నందున, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తీరం దాటి వేటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వర్షభారంతో పాడే ప్రాంతాల్లో నివసించే వారు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
Commercial Gas : కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్