Heart Attack: 12 ఏళ్లకే గుండెపోటు.. బస్సులోనే మృతి చెందిన బాలుడు..!

  • Written By:
  • Publish Date - December 16, 2022 / 08:11 PM IST

Heart Attack: ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తోంది. పిల్లలు కూడా ఇందులో బాధితులగా మారుతున్నారు. ఇంతకు ముందు 60 ఏళ్లు పైబడిన వారిలో గుండెపోటు సమస్యలు వచ్చేవి. అయితే, మారిన జీవనశైలితో హార్ట్‌ అటాక్‌ సమస్యలు చిన్న పిల్లల్లోనూ వస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా తాజాగా జరిగిన ఘటన నిలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో స్కూలు పిల్లాడు గుండెపోటుతో మృత్యువాత పడటం ఇప్పుడు కలకలం రేపుతోంది.

మధ్యప్రదేశ్‌ లోని భిండ్‌ ప్రాంతంలో 12 ఏళ్ల బాలుడికి హార్ట్‌ అటాక్‌ వచ్చింది. కార్డియాక్‌ అరెస్ట్‌తో ప్రాణాలు విడిచాడు. చిన్న పిల్లల్లోనూ హార్ట్‌ అటాక్‌ రావడం మధ్యప్రదేశ్‌లో ఇదే తొలిసారి అని తెలుస్తోంది. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అక్కడి వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్కూలుకు వెళ్తున్న బాలుడు ఇలా మృతి చెందడంతో పాఠశాలలో సహచర విద్యార్థులను కలవరపెడుతోంది. ఉపాధ్యాయులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న మనీష్‌ జాతవ్‌.. ఎప్పటిలాగే గురువారం తన సోదరుడితో కలిసి స్కూల్లో భోజనం తిన్నాడు. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు స్కూలు బస్సు ఎక్కాడు. ఇంతలోనే ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి క్షణాల్లోనే కుప్పకూలిపోయాడు. అప్పటి వరకు చలాకీగా ఉండి, అందరితోపాటు ఆడిపాడిన బాలుడు ఇలా పడిపోవడంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీన్ని గమనించిన బస్సు డ్రైవరు స్కూల్‌ యాజమాన్యానికి సమాచారం అందించాడు. స్పృహ కోల్పోయాడేమో అని అనుమానంతో ఆస్పత్రికి తరలించారు.

కరోనా తర్వాత ఇలాంటి కేసులు పెరిగాయి..
అయితే, బాలుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు సీపీఆర్‌ చేసినా ఫలితం లేకపోయింది. బాలుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. కేవలం 12 ఏళ్లకే హార్ట్‌ అటాక్‌ రావడం చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్లు పేర్కొంటున్నారు. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఇలాంటి కేసులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఇప్పటి వరకు తమ బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని బాలుడి తల్లిదండ్రులు చెప్పారు. పోస్టుమార్టం చేసేందుకు వారు నిరాకరించారు.