Site icon HashtagU Telugu

Covid Situation:ఉన్న‌తాధికారుల‌తో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కీల‌క స‌మావేశం

దేశంలో క‌రోనా కొత్త కేసులు పెరుగుతుండ‌టంతో ప‌రిస్థితిని స‌మీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండ‌వియా కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ఒమిక్రాన్ ముప్పు అలాగే దేశంలోని 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి టీకాలు వేయాలనే ఇటీవ‌ల తీసుకున్న నిర్ణయం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఆరోగ్య శాఖ‌ మంత్రులు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నతాధికారులతో మన్సుఖ్ మాండవియా మాట్లాడారు. క‌రోనా నిర్థార‌ణ ప‌రీక్ష‌లు, ట్రాకింగ్ ట్రేసింగ్ వ్యాక్సినేష‌న్ పై అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.

ఇంత‌క‌ముందు క‌రోనపై బలమైన పోరాటం చేసామని.. ఓమిక్రాన్ వేరియంట్ ని ఎదుర్కోనేందుకు ప్రయత్నాలపై చేస్తున్నామ‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా దేశాలు మునుపటితో పోల్చితే కోవిడ్ -19 కేసులలో మూడు నుండి నాలుగు రెట్లు పెరుగుదలను ఎదుర్కొంటున్నాయని మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఒమిక్రాన్‌ వేరియంట్ చాలా ఎక్కువగా వ్యాపిస్తుందని తెలిపారు. రాష్ట్రాలు ECRP-II కింద ఆమోదించబడిన నిధులను మెరుగ్గా ఉపయోగించుకోవాలని.. కోవిన్ పోర్ట‌ల్ ని ఉపయోగించి లబ్దిదారులను జిల్లాల వారీగా అంచనా వేయడం ద్వారా వారి వ్యాక్సిన్ మోతాదుల అవసరాన్నిగుర్తించాల‌న్నారు. టీకాల‌ పురోగతి జాతీయ సగటు కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు తమ టీకా ప్రచారాన్ని వేగవంతం చేయాలని ఆరోగ్య మంత్రి కోరారు. కొత్త టీకా మార్గదర్శకాలను సజావుగా అమలు చేయాల్సిన ఉంద‌ని.. 15-18 ఏళ్ల మధ్య వయసు గ‌ల వారికి టీకాలు వేయడానికి ఆయా బృందాల సభ్యులకు దిశానిర్దేశం చేయాలని తెలిపారు.