Rahul Gandhi: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై ప్రశంసలు కురిపించారు. ఆయన ఎంతో ధైర్యవంతుడైన రాజకీయ నాయకుడని అన్నారు. ప్రజల్లో తన ఇమేజ్‌ను మరింత పెంచుకునేందుకు రాహుల్ తనను తాను ఎంతో సంస్కరించుకున్నారని పేర్కొన్నారు. ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా వేదికలో సైఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నేతల గురించి చర్చ రాగా.. ‘ఎలాంటి నాయకుడిని ఇష్టపడతారు?’ అంటూ వ్యాఖ్యాత అడిగారు. దీనికి సైఫ్ బదులిస్తూ.. ‘ధైర్యంగా, నిజాయతీగా ఉండే రాజకీయ నాయకులంటే ఇష్టం’ అని చెప్పారు. అప్పుడు వ్యాఖ్యాత కొందరు పేర్లను సూచించారు. ‘ప్రధాని మోడీ, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ‘లో ఎవరిని ఎంచుకుంటారని అడిగారు.
Read Also: ED Raids : మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ అధికారుల సోదాలు
దీనికి సైఫ్ స్పందిస్తూ.. ”వాళ్లంతా ధైర్యవంతులైన రాజకీయ నాయకులే. అయితే, రాహుల్‌గాంధీ తీరు నన్ను కాస్త ఎక్కువగా ఆకట్టుకుంటోంది. గతంలో ఆయన చేసే పనులను, చెప్పే మాటలను కొంతమంది అగౌరవపర్చిన సందర్భాలున్నాయి. అలాంటి స్థితి నుంచి ఆయన తనను తాను ఎంతగానో మార్చుకున్నారు. ప్రజల్లో ఆదరణ చూరగొనేందుకు చాలా కష్టపడ్డారు. ఆ ప్రయాణం చాలా ఆసక్తిగా అనిపిస్తోంది” అని సైఫ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజాగా ‘దేవర’ సినిమాలో భైర పాత్రలో ఆకట్టుకున్నారు సైఫ్. ఎన్టీఆర్ అడ్డు తొలగించుకొని సంద్రాన్ని శాసించాలనుకొనే పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఎన్టీఆర్, సైఫ్‌ల మధ్య యాక్షన్ సన్నివేశాలు మరో స్థాయిలో ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.