By: డా. ప్రసాదమూర్తి
Nitish Kumar : ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి అంతా రానున్న సార్వత్రిక ఎన్నికల మీదే ఉంది. ఇప్పుడు జరగబోతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకం. అయితే ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత ఏ మేరకు కనిపిస్తుందనే విషయం దేశమంతా గమనిస్తోంది. అసలే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి, సమాజ్వాది పార్టీకి మధ్య పొత్తు కుదరక, అది ఆ రెండు పార్టీల నాయకుల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. ప్రతిపక్షాల కూటమి, ‘ఇండియా బ్లాక్’ లక్ష్యం సార్వత్రిక ఎన్నికలేనని, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీల ఎన్నికలు ఈ కూటమిలో సర్దుబాటులకు, సయోధ్యలకు సంబంధించింది కాదని ఒకపక్క కాంగ్రెస్ వారు మాట్లాడుతున్నారు.
ఈ విషయంలో తమకు స్పష్టత లేదని సమాజ్వాది పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్లో తమను చర్చలకు పిలిచి కాంగ్రెస్ మోసం చేసిందన్న రీతిలో సమాజ్వాది పార్టీ విమర్శిస్తోంది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ కూడా యూపీలో 80 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు అజయ్ రాయ్ చేసిన ప్రకటన ప్రతిపక్షాల మధ్య ఏకీభావం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష మహాకూటమికి ముఖ్య నాయకుడు నితీష్ కుమార్ (Nitish Kumar), బిజెపి నాయకులతో తన మిత్రత్వం జీవితమంతా ఉంటుందని చేసిన వ్యాఖ్య పలు ఊహాగానాలకు దారి తీసింది.
We’re now on WhatsApp. Click to Join.
బీహార్ లోని తూర్పు చంపారన్ జిల్లా, మోతిహారిలో మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో నితీష్ కుమార్ (Nitish Kumar) మాట్లాడుతూ, బీజేపీతో లో పలువురు నాయకులతో తన స్నేహబంధం జీవితమంతా సజీవంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ మాటలు ఆయన మాట్లాడినప్పుడు వేదిక మీద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, బీహార్ సీనియర్ బిజెపి నాయకుడు, మాజీ కేంద్రమంత్రి రాధా మోహన్ సింగ్ ఉన్నారు. నితీష్ కుమార్ (Nitish Kumar) తన ప్రసంగంలో బిజెపి నాయకులతో తన మిత్రత్వం గురించి ప్రత్యేకంగా పేర్కొనడం ఇప్పుడు జాతీయ మీడియాలో పెద్ద చర్చిగా మారింది. “ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారు అన్నది కాదు, బిజెపి నాయకులతో నా స్నేహం నా జీవితమంతా ఉంటుంది. దారులు వేరయినంత మాత్రాన స్నేహం అంతమైపోతుందా?” అంటూ ఆయన వేదిక మీద ఉన్న బిజెపి నాయకుడు రాధా మోహన్ సింగ్ ని చూపిస్తూ మాట్లాడారు.
అసలే ఎన్నికల కాలం. కీలకమైన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మరో ఏడెనిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రతిపక్షాలు ఐక్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని, బిజెపిని ఢీకొనాలని అన్ని కసరత్తులూ చేస్తున్నాయి. ప్రతిపక్షాల కూటమిలో నితీష్ కుమార్ కీలకమైన నేత. ఇలాంటి సమయంలో నితీష్ ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు, ఆయన మనసులో ఏముంది? గతంలో చాలాసార్లు ఆయన ఎన్డీఏ లో ఉన్నారు. మంత్రి పదవులు నిర్వహించారు. బిజెపితో గట్టి బంధాన్ని కొనసాగించారు. తర్వాత ఆయన ఎన్డీఏ నుంచి విడిపోయి బీహార్లో ఆర్జేడి, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బిజెపికి గట్టి పోటీ ఇవ్వగలిగే సత్తా ఉన్న నాయకుడిగా ఎదిగారు.
Also Read: AP CM Jagan : దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
ఇప్పుడు ప్రతిపక్ష ఇండియా కూటమి ముందు ముందు ఎన్నికల్లో విజయాలు సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే పరిస్థితి వస్తే ఆ కూటమికి నాయకత్వం వహించే స్థాయి నితీష్ కుమార్ కి ఉందని కూడా పలువురు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో బిజెపితో తనకున్న బంధాన్ని గురించి ఇలా నితీష్ ఎందుకు మాట్లాడారు అనేది రకరకాల ఊహాగానాలకు, చర్చలకు, ఎన్నో సందేహాలకు దారి తీస్తోంది. సెప్టెంబర్ ఒకటి తర్వాత ప్రతిపక్షాల కూటమి సమావేశం కాలేదు. కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావిడిలో మునిగిపోయి ఉంది. ఈ రెండు నెలల్లో విశేషమైన కార్యక్రమం ఏదీ ఇండియా కూటమి తీసుకోలేదు. ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధం విషయంలో తమ కూటమి పాలస్తీనీయులకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఒక ప్రకటన రిలీజ్ చేయడం తప్ప, ఐక్య కార్యాచరణతో కూడుకున్న ఉద్యమం ఏదీ, కార్యక్రమం ఏదీ ఈ మధ్య జరగలేదు.
అంతేకాదు ప్రతిపక్షాల ఇండియా కూటమికి కన్వీనర్ గా నితీష్ కుమార్ కాబోతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో కన్వీనర్ పదవి అలా ఖాళీగా ఉండిపోయింది. తనను కన్వీనర్ చేయకపోవడం వల్ల నితీష్ ఈ కూటమితో కొంతకాలంగా ఎడంగా ఉంటున్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. అసలే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాల పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. తమ ఐక్యత దేశవ్యాప్త ఎన్నికలకు మాత్రమే పరిమితం అవుతుందని కాంగ్రెస్ ఎప్పుడు వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత ఒక ప్రశ్న చిహ్నంగా మారింది. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే నితీష్ కుమార్ ఇప్పుడు బిజెపి నాయకులతో తన బంధం పట్ల ఇంత మమకారాన్ని వ్యక్తం చేయడం నిజంగానే ఎన్నో సందేహాలకు దారితీస్తోంది. మరి దీని పట్ల నితీష్ లేదా ఇతర ప్రతిపక్షాల నాయకులు ఎలాంటి వివరణలు ఇస్తారో చూడాలి.
Also Read: BRS Govt: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా బోనస్