Uttar Pradesh : విద్వేషం విద్యాలయాల్లోకి ప్రవేశించిందా?

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ముజఫర్ నగర్ కి చెందిన ఖుబ్బాపూర్ లో జరిగిన ఘటన దేశంలో శాంతి సామరస్యాలు కోరకునే వారందరికీ చాలా విషాదాన్ని మోసుకొచ్చింది.

  • Written By:
  • Updated On - August 28, 2023 / 02:21 PM IST

By: డా. ప్రసాదమూర్తి

Uttar Pradesh School Incident Gone Viral : ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కి చెందిన ఖుబ్బాపూర్ లో జరిగిన ఘటన దేశంలో శాంతి సామరస్యాలు కోరకునే వారందరికీ చాలా విషాదాన్ని మోసుకొచ్చింది. అందరి గుండెల్ని కలచివేసింది. జరిగింది చిన్నదో పెద్దదో సంఘటన కావచ్చు. ఒక స్కూల్ టీచర్ ముస్లిం కుర్రాడిని హిందూ కుర్రాళ్ళతో కొట్టించింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. కొన్ని సెకన్ల వీడియో దేశంలో అన్ని కోణాలకూ దావానలంగా పాకిపోయింది. త్రిప్తా త్యాగి అనే టీచర్ తన ఇంటి వద్దనే నేహా పబ్లిక్ స్కూల్ నడుపుతోంది. తన స్కూల్ తన ఇష్టం అంటే కుదరదు. అసలు స్కూళ్ళలో కార్పోరల్ పనిష్మెంట్ అనేదే నిషేధించిన కాలం ఇది.

ఇలాంటి కాలంలో, అందునా దేశంలో మెజారిటీ, మైనారిటీ మత వర్గాల మధ్య సామరస్యంతో రాజకీయ వర్గాలు ఆటలాడుకుంటున్న విపత్కర సందర్భంలో ఇలాంటి ఘటన జరగడం అందరినీ ఆవేదనకు గురిచేయడమే కాదు, ఆలోచనల్ కూడా పడేసింది. పిల్లవాడు చదవకపోతే టీచర్ కొట్టినా తిట్టినా ఇంకా ఏ తల్లిదండ్రులూ పెద్దగా అభ్యంతరాలు చెప్పడం లేదు. తన పిల్లవాడి బాగోగుల కోసమే కదా అని వారు సరిపెట్టుకుంటున్నారు. నా చిన్నప్పుడు మా మాస్టారు కాళ్ళూ చేతులూ కట్టేసి మరీ కొట్టేవాడు. ఆయన్ని మా ఊళ్ళో ఎవరూ పల్లెత్తి మాటనే వారు కాదు. ఇప్పటికీ పేరెంట్స్ విషయంలో టీచర్ల పట్ల ఎక్కువ శాతం ఈ వైఖరే కనిపిస్తుంది.

కానీ త్రిప్తా త్యాగీ అనే టీచరమ్మ చేసిన పని, అది ఆమెకు మాత్రమే సంబంధించిన విషయంగా తీసుకుని ఆమెకు ఏదో శిక్ష విధించి చేతులు దులుపుకుంటే సరిపోయేదిగా కనిపించడం లేదు. ఆ ముస్లిం కుర్రాడు, ఇచ్చిన హోం వర్క్ చేయలేదే అనుకుందాం. అందుకు టీచర్ అతగాడిని మందలించ వచ్చు. లేదా కోపంతో చేయి కూడా చేసుకోవచ్చు. కానీ ఆ ముస్లిం పిల్లవాడిని హిందూ పిల్లలతో కొట్టిస్తే అతను బాగుపడతాడని ఆమె ఎలా భావించింది? అతడిన ఉద్ధరించడానికి మతం ఎందుకు సాధనంగా కనిపించింది? ఒక వర్గం పిల్లవాడిని బాగు చేయడానికి మరో వర్గం పిల్లవాళ్ళతో శిక్షలు వేయించాలని ఆమె ఎలా ఆలోచించింది? కేవలం ఆమె చేసిన ఈ పని తప్పు అని, ఆమెను దోషిగా నిలబెట్టి దండించడంతోనే ఈ నేరం సమసిపోతుందా? ఇదే ప్రశ్న నన్నే కాదు, దేశంలో ఎందరో మేధావుల్ని తొలచివేస్తున్నది. దేశంలో ఉన్న అల్ప సంఖ్యాక మతస్తులు ఈ దేశం వారు కాదని నెట్టివేసే ప్రయత్నాలు సి.ఏ.ఏ., ఎన్నార్సీ రూపంలో సాగిన నేపథ్యం ఉంది.

గో మాంసం పేరు మీద అమాయక అఖ్లాక్ లను బలిగొన్న ఉదంతాలున్నాయి. ఎక్కడ ఏం జరిగినా అక్కడ ఒక మైనారిటీ మత కోణాన్ని ఆవిష్కరించడాని శతవిధాలా సాగుతున్న తంత్ర మంత్రాంగాలున్నాయి. ఇలాంటి నేపథ్యాల అభివృద్ధి ఇండెక్స్ లో అంచలంచెలుగా ముందుకు సాగిపోతున్న దేశంలో త్రిప్తా త్యాగీలే పుట్టుకొస్తారు. చెట్టుకు పుట్టిన కుక్కమూతి పిందెలు తెంపేస్తే సరిపోదు. ఆ చెట్టు వేళ్ళెక్కడున్నాయి..వాటికి నీళ్ళెక్కడి నుంచి వస్తున్నాయి అన్నది చూడాలి. స్వాతంత్ర్యం కోసం, మతసామరస్యం కోసం మహాత్ములు చేసిన త్యాగాలు గుర్తు చేసుకోవాలి. అప్పుడే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్న సద్బుద్ధి పాలకులకు కలుగుతుంది. అప్పుడే ఈ త్యాగ భూమిలో త్యాగీ టీచర్ లాంటి వారు పుట్టడానికి అవకాశం ఉండదు.

జరిగిందేదో జరిగింది. కానీ దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసమో, స్వార్థ ప్రయోజనాల కోసమో వాడుకోవడానికి చూడకుండా దానికి మూల కారణాలను కనుక్కోవడం..వాటిని నిర్మూలించడానికి నిజాయితీగా చిత్తశుద్ధితో ప్రయత్నించడం ఒక్కటే శరణ్యం. సంఘం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి.

Also Read:  Telangana War : తెలంగాణలో యుద్ధం ఆ రెండు పార్టీల మధ్యనే